CBN Fire On YSRCP Govt: మూడేళ్ల జగన్ పాలన పూర్తి వైఫల్యంగా సాగిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అందరిపై బాదుడే బాదుడుతో మోయలేని భారం మోపుతున్నారని విమర్శించారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని ఇక వారిని ఎవరూ ఆపలేరన్నారు. జగన్ లాంటి నియంతలకు తాను భయపడనని అన్నారు.తెదేపా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వ దోపిడిని వివరించాలన్నారు. దొంగ లెక్కలు రాయటం..దొరికిపోవటం జగన్ తీరని ఎద్దేవా చేసిన చంద్రబాబు..అప్పులతో రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆక్షేపించారు.‘యువత.. పేదల కోసమే నేను మీ ముందుకు వస్తున్నా. ప్రజలకు జరిగే నష్టం నివారించడానికి, భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నా’ అని అధినేత చంద్రబాబు చెప్పారు.
గుంటూరుకు చెందిన వెంకాయమ్మ ప్రభుత్వ తీరుపై వాస్తవాలు చెబితే ఆమె ఇంటిపై దాడి చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు తెదేపా నుంచి వెళ్లినవాళ్లే ఉన్నారన్నారు. సీబీఐ కేసుల్లో తనతో ఉన్నవారితో పాటు, కేసులు వాదించిన వారికి జగన్ రాజ్యసభ సీట్లు ఆఫర్ చేశారని ఆక్షేపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరిని రాజ్యసభకు పంపుతున్నారని.., రాజ్యసభకు పంపేందుకు ఏపీలో సమర్థులు లేరా ? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
"ఒంగోలులో మహానాడుకు స్టేడియం ఎందుకివ్వలేదు. కడపలో అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా ?. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ దోపిడీని వివరించాలి. జగన్ చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైంది. పులివెందులలో బస్టాండ్ కట్టలేనివాళ్లు 3 రాజధానులు కడతారా ?. పులివెందులలో రైతులకు బీమా ఎందుకు రావడం లేదు. బైక్‌పై మృతదేహాన్ని తరలిస్తే సీఎం కనీసం స్పందించారా ?. అత్యాచార బాధితులను కనీసం పరామర్శించారా ?. కడప విమానాశ్రయం వద్ద కార్యకర్తలపై ఆంక్షలా ?." -చంద్రబాబు, తెదేపా అధినేత
అనంతరం 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేటలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్న చంద్రబాబు.. రాజ్యసభ సీట్లను గంపగుత్తగా అమ్ముకున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కడప జిల్లాకు ఒక్క పరిశ్రమ తెచ్చిందా అని నిలదీశారు. రికార్డులు మార్చేసి బద్వేల్ ఎమ్మెల్సీ 800 ఎకరాలు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. తన వయసు 72 అయినా.. స్ఫూర్తి మాత్రం 27 అని చంద్రబాబు వ్యాఖ్యనించారు.