మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 52వ రోజు చేపట్టారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ కుటుంబం హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో.. వారిని మరోసారి విచారించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కానీ 15రోజుల క్రితం సునీల్ యాదవ్ కుటుంబం.. పులివెందుల నుంచి వెళ్లిపోయారు. సునీల్ యాదవ్, అతని భార్య, సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్, తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రిలను సీబీఐ అధికారులు గతంలో పలుమార్లు ప్రశ్నించారు. విచారణ పేరుతో వేధిస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని.. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 15 రోజుల నుంచి వారి కుటుంబం పులివెందులలో కనిపించక పోవడంపై చర్చనీయాంశంగా మారింది.
హైకోర్టులో పిటిషన్ వేసి సునీల్ కుటుంబం.. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు పులివెందులకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. బుధవారం.. సునీల్ కుటుంబానికి చెందిన దగ్గర బంధువైన యువరాజును.. సీబీఐ అధికారులు అనంతపురానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సునీల్ కుటుంబం గతంలో అనంతపురంలో నివాసం ఉన్నారు.. ఈ మేరకు వారి సమాచారం తెలుసుకునేందుకు యువరాజును తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.