కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం దస్తగిరిపేటకు చెందిన అస్రా ఖురేషీ.. చిన్ననాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేది. తన తాత, తండ్రులు వైద్యులు కావాలనుకున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించక కాలేకపోయారు. వారి కోరికను తన లక్ష్యంగా మార్చుకుని ప్రణాళికబద్ధంగా చదువుతూ.. గమ్యం వైపు అడుగులు వేసింది. ఏడో తరగతి వరకూ పొద్దుటూరులో, పదో తరగతి హైదరాబాద్ నారాయణ కళాశాలలో చదివింది. ఆ కళాశాలలోనే బైపీసీలో ఇంటర్ విద్య అభ్యసించి.. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో 54వ ర్యాంకు సాధించింది. అలానే జాతీయస్థాయి పరీక్ష నీట్లో జాతీయస్థాయిలో 16వ ర్యాంకు.. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. మూడుతరాల కోరికను తన కుమార్తె తీర్చటంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అవదుల్లేవు.
అయితే తన లక్ష్యం దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యవిద్య అభ్యసించాలని. దానికోసం చక్కని ప్రణాళికతో సిద్ధమైంది. దానికి సంబంధించిన పరీక్ష రాసింది. వాటి ఫలితాలు జూన్ 12న రానున్నాయి. అలాగే మరో దేశవ్యాప్త ప్రతిష్టాత్మక పరీక్ష జిప్మర్కు హాజరైంది. ఈనెల 10న వాటి ఫలితాలూ వస్తాయి. వాటిలో కూడా మంచి ర్యాంకు సాధిస్తాననే గట్టి నమ్మకంతో ఉన్నారు అస్ర.