BJP on YSRCP: వైకాపా ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వైకాపా పరిపాలన తీరును ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో భాజపా ఆధ్వర్యంలో జరుగుతున్న 'రాయలసీమ రణభేరి' సభలో ఆయన పాల్గొన్నారు. పాలకుల నిర్లక్ష్యమే రాయలసీమ వెనుకబడటానికి కారణమని కిషన్‌రెడ్డి విమర్శించారు. రతనాల సీమ వెనుకబడిపోయిందన్నారు. రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రలు వచ్చినప్పటికీ సీమలో అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. సాగునీటి ప్రాజక్టులపై నిర్లక్ష్యమే ఈ ప్రాంతం వెనుబాటుకు కారణమని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో లిక్కర్, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా నేతలపై కేసులు పెడుతూ అణచివేయడం సరికాదని హితవు పలికారు.
బీసీలను ఓటుబ్యాంకుగానే చూస్తున్నాయి: సుజనా చౌదరి
ప్రాంతీయ పార్టీలు బీసీలను ఓటుబ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప..రాజ్యాధికారం దరిచేరనీయడం లేదని భాజపా నేత సుజనా చౌదరి విమర్శించారు. కడప జిల్లాలో పెద్దఎత్తున బీసీలు ఉన్నా.. పదవులు, అధికారం మాత్రం అగ్రవర్ణాల చేతిలోనే ఉందన్నారు. ఒకే సామాజికవర్గానికి పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.