ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో బెట్టింగ్ రాయుళ్లు మకాం... భారీగా పందేలు - tdp

వచ్చే నెల 23న వెల్లడయ్యే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై... కడప జిల్లాలో పందేలు జోరుగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల గెలుపు, మెజారిటీపై కోట్లల్లో బెట్టింగ్ జరుగుతోంది. విజయవాడకు చెందిన బెట్టింగ్ రాయుళ్లు జిల్లాలో మకాం వేసి... కోట్ల రూపాయల పందేలు కాస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.  2014 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని పందేలు వేసి దివాళా తీసిన వారు... ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా జమ్మలమడుగు మెజారిటీపై భారీగా పందేలు వేసినట్లు సమాచారం.

బెట్టింగ్ జోరు

By

Published : Apr 28, 2019, 5:56 PM IST

కడపలో బెట్టింగ్ జోరు

2014 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని... కడప జిల్లాకు చెందిన ఆ పార్టీ అభిమానులు, పందెం రాయుళ్లు కోట్ల రూపాయలు పందెం కాశారు. కానీ జగన్ సీఎం కాకపోవడంతో... చాలామంది కోట్ల రూపాయలు నష్టపోయి... ఐపీ పెట్టుకున్న ఘటనలున్నాయి. ఈసారి కూడా ఎన్నికల ఫలితాలపై పందేలు జోరుగా సాగుతున్నాయి. జగన్ సీఎం అవుతారనే దానికంటే కూడా... జిల్లాలో ఎన్ని స్థానాలు గెలుస్తారు... అభ్యర్థుల మెజారిటీ ఓట్లపైనే బెట్టింగ్ జోరుగా సాగుతోంది.

సొంతంగా సర్వేలు...
ఈనెల 11న పోలింగ్ ముగిసినప్పటి నుంచి... పందెం రాయుళ్లు జిల్లాలో సొంతంగా సర్వేలు చేయించుకున్నారు. కొందరు మధ్యవర్తులు, మీడియా ద్వారా సమాచారం సేకరించి పందేలు కాస్తున్నారు. మే 23న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి... ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే దానిపై పందేలు కాస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి నియోజకవర్గ అభ్యర్థుల గెలుపు, మెజారిటీపై కోట్ల రూపాయల బెట్టింగ్ నడుస్తోంది.

బెజవాడ నుంచి బెట్టింగ్ రాయుళ్లు...
బెజవాడ నుంచి వచ్చిన బెట్టింగ్ రాయుళ్లు... ప్రొద్దుటూరులో మకాం వేసి పందెం కాస్తున్నట్లు సమాచారం. పులివెందులలో వైకాపా అభ్యర్థి జగన్ మెజారిటీ 50 వేలు దాటుతుందని కొందరు... గత ఎన్నికలంటే తగ్గుతుందని మరికొందరు పందెం కాస్తున్నారు. జమ్మలమడుగులో తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డి గెలుపు కంటే కూడా మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై పందేలు వేస్తున్నారు. మెజారిటీ 10 నుంచి 20 వేల వరకు వస్తుందని పందెం కాసేవాళ్లూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి కడప ఎంపీ అభ్యర్థిగా వచ్చే మెజారిటీపైనా... రామసుబ్బారెడ్డి కంటే ఆదినారాయణరెడ్డికి జమ్మలమడుగు నియోజకవర్గంలో మెజారిటీ ఎక్కువ వస్తుందని పందెం కాస్తున్నారు.

రాయచోటిలో పోటాపోటీ...
రాయచోటిలో ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. ఇక్కడ గత ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని ఓ వ్యక్తి కోటి రూపాయలు పందెం కాసి దివాళా తీశారు. చివరికి ఆత్మహత్యాయత్నం చేసుకోగా... కుటుంబ సభ్యుల ఓదార్పుతో కుదుటపడ్డారు. ఈసారి కూడా రాయచోటిలో తెదేపా గెలుస్తుందని కొందరు... వైకాపా గెలుస్తుందని మరికొందరు కోట్లలోనే పందెం కాశారు. ఈ నియోజకవర్గంలో 20 కోట్లు పైగానే పందెం నడిచినట్లు సమాచారం. కమలాపురం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి 5 వేల ఓట్లతో గెలుస్తాడని కొందరు పందెం కాస్తుండగా.... స్వల్పంగానైనా వైకాపా అభ్యర్థి రవీంద్రనాథ్​రెడ్డి నెగ్గుతారని బెట్టింగ్ వేస్తున్నారు.

మైదుకూరులో జోరుజోరుగా...
మైదుకూరులోనూ తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 10వేల ఓట్లతో గెలుస్తారనే పందెం జోరుగా సాగుతోంది. వీటితోపాటు కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా, వైకాపా ఎన్నిసీట్లు గెలుస్తుందనే దానిపై కూడా పందేలు వేస్తున్నారు. వైకాపా అన్ని సీట్లు గెలుస్తుందనీ పందెం నడుస్తోంది. తెదేపా నాయకులు, కార్యకర్తలు కూడా 3 సీట్లు కచ్చితంగా గెలుస్తామనే దానిపై పందెం కాస్తున్నారు.

అధికారం మాదంటే... మాది..
రాష్ట్రంలోనూ తెదేపా అధికారంలోకి వస్తుందని కొందరు, వైకాపా అధికారంలోకి వస్తుందని మరికొందరు పందెం వేస్తున్నారు. రాష్ట్రంలో వైకాపాకు వచ్చే సీట్ల సంఖ్య, తెదేపాకు వచ్చే సీట్ల సంఖ్యపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కడప జిల్లాకు చెందిన ఓ నేత కూడా బెట్టింగ్​లో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పందెం కాసిన వ్యక్తులు... డబ్బును మధ్యవర్తి వద్ద పెట్టి... మే 23న ఫలితాలు వెల్లడి కాగానే... ఎవరు గెలిస్తే వారు డబ్బు తీసుకునే విధంగా ఒప్పందం చేసుకుంటున్నారు. కొందరు అప్పులు చేసి మరీ పందేలు కడుతుంటడం గమనార్హం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details