కర్మాగారం జోలికొస్తే చూస్తూ ఊరుకోం..!
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తే ఉద్యమాలు తప్పవని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నారు. కడపలో తెదేపా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వైకాపా, వామపక్షాలు ధర్నా చేపట్టాయి. నగరం అంతా తిరుగుతూ ఉక్కు కర్మాగారానికి మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాంటివి ఉక్కు కర్మాగారం ప్రైవేటు వారికి ఇస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కర్మాగారం పై గట్టిగా స్పందించాలని డిమాండ్ చేశారు. విశాఖ కర్మాగారం జోలికొస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ప్రశాంతంగా బంద్
కడప జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బందుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో జిల్లాలో 8 డిపోల పరిధిలో దాదాపు 800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్టాండ్ బోసిపోయింది. కొంతమంది తెలియక బస్టాండ్‌లోని పడిగాపులు కాశారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. షాపింగ్ మాల్స్, దుకాణ సముదాయాలు అన్నింటిని మూసేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు ఉద్యమాలు చేపడుతున్నామని కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు.