కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. బద్వేలు నియోజకవర్గం 7 మండలాల్లోని 281 కేంద్రాల్లో అక్టోబరు 30న పోలింగ్ జరగ్గా.. 68.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. మెుత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా వైకాపా, భాజపా, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. వైకాపా నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధ, భాజపా నుంచి పనతల సురేశ్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీలో ఉన్నారు.
కౌంటింగ్ కోసం బద్వేలు ఏపీ గురుకుల పాఠశాలలో నాలుగు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో 7 టేబుళ్ల చొప్పున మొత్తం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా సిబ్బంది, ఏజెంట్లకు మధ్య భారీ కేడ్లు, కంచె ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో భాగంగా ముందుగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను అభ్యర్థుల తరపు ఏజెంట్ల సమక్షంలో తెరిచి కౌంటింగ్ కేంద్రానికి తీసుకొస్తారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్లు లెక్కిస్తారు. 235 వరకు పోస్టల్, సర్వీసు ఓట్లు వచ్చినట్లు ఆర్వో తెలిపారు. ఈవీఎంల ద్వారా లెక్కించే ఫలితాలు మధ్యాహ్నానికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. పది రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయని ఆర్వో కేతన్ గార్గ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో ర్యాండమ్ చెకింగ్ కోసం ఒక వీవీ ప్యాట్‌ను ప్రతి గదిలో అందుబాటులో ఉంచామన్నారు. కౌంటింగ్ కేంద్రంలో సూపర్ వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు అందుబాటులో ఉంటారని తెలిపారు.