KADAPA DOCTOR ATCHENNA MURDER CASE UPDATES : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కడప పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్, దళిత ఉద్యోగి అచ్చెన్న హత్య కేసు నిందితులను కోర్టు అనుమతితో పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. గత నెల 12వ తేదిన అచ్చెన్న అదృశ్యం కావడంతో 14వ తేదీ అచ్చెన్న భార్య, కుమారులు కడప ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్య కేసు నమోదు చేసి గాలిస్తుండగా అదే నెల 24వ తేదీ అచ్చెన్న గువ్వలచెరువు ఘాట్ రోడ్లో శవమై కనిపించాడు. అప్పటికే శవం గుర్తుపట్టలేని విధంగా మారడంతో అతని వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా అచ్చెన్నగా పోలీసులు గుర్తించారు. అనంతరం హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా.. కాల్ డేటా, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అదే శాఖలో పనిచేస్తున్న మరో పశువైద్యులు సుభాష్ చంద్రబోస్, మరో ఇద్దరు బయట వ్యక్తుల సహకారంతో అచ్చెన్నను హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ఆ ముగ్గురిని 10 రోజుల కిందట పోలీసులు అరెస్టు చేశారు. అచ్చెన్న కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులో మరికొంతమంది అధికారుల హస్తముందని తెలియడంతో పోలీసులు కోర్టు అనుమతి తీసుకుని సుభాష్ చంద్రబోస్‌తో పాటు మరో ఇద్దరిని రెండు రోజులు పాటు తమ కస్టడీకి తీసుకున్నారు.
హత్య వెనకాల సుభాష్ చంద్రబోస్ హస్తం ఉందా లేకుంటే మరి కొంతమంది సిబ్బంది హస్తముందా అనే కోణాలలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు అచ్చెన్న మృతిపై వివిధ జిల్లాలలో నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. అచ్చెన్న హత్య కేసులో రాష్ట్ర డైరెక్టర్‌తో పాటు మరో ముగ్గురు అధికారులపై.. అటు అచ్చెన్న కుటుంబ సభ్యులు, అఖిలపక్ష పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అచ్చన్న హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉదయం 10 గంటలకు కడపలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆరు నెలలుగా వివాదం.. కడప బహుళార్థ పశువైద్యశాలలో ఉపసంచాలకుడిగా విధులు నిర్వహిస్తున్న అచ్చెన్నకు.. అదే వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పని చేసే సురేంద్రనాథ్ బెనర్జీ, శ్రీధర్ లింగారెడ్డి, సుభాష్ చంద్రబోస్‌కు మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. సురేంద్రనాథ్ బెనర్జీ, శ్రీధర్ లింగారెడ్డి, సుభాష్ చంద్రబోస్‌లు విధులు నిర్వర్తించే విధానంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలను, నిబంధనలను పాటించట్లేదని.. తనకు కూడా సహకరించట్లేదని పేర్కొంటూ అచ్చెన్న వారిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆ ముగ్గురూ కలిసి అచ్చెన్నే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపైన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. సరెండర్ చేసిన ఆ ముగ్గురినీ విధుల్లో చేర్చుకోవాలని అచ్చెన్నను ఉన్నతాధికారులు ఆదేశించగా.. ఆయన అందుకు నిరాకరించారు. ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే ఆయన అదృశ్యమై శవమై కనిపించారు.
ఇవీ చదవండి: