కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో హిమకుంట్ల విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో పనిచేస్తున్న సహాయ లైన్‌మేన్ (ఏఎల్‌ఎం) ఖాదర్‌వలీ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా.. అనిశా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఖాజాఖాన్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఖాదర్ ను అరెస్టు చేశారు. హిమకుంట్ల గ్రామానికి చెందిన రామగౌని లోకేష్‌గౌడ్.. తన పిన్ని లక్ష్మీదేవి పొలం వద్ద విద్యుత్తు సర్వీసు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ పనికి లంచం ఇవ్వాలంటూ ఏఎల్‌ఎం వేధిస్తుండగా.. విసిగిపోయిన బాధితుడు కడప ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
లోకేష్ నుంచి ఏఎల్‌ఎం రూ.4,000లను తీసుకొంటుండగా అనిశా సిబ్బంది అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి సర్వీసు ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఏఎల్‌ఎం లంచం డిమాండు చేస్తున్నారని బాధితుడు మీడియాకు చెప్పాడు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు పనులు చేయకుండా లంచం కోసం వేధిస్తుంటే తమకు సమాచారం అందివ్వాలని.. ఏసీబీ డీఎస్పీ ఖాజాఖాన్ కోరారు. ఈ తనిఖీల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రామాంజనేయులు, రెడ్డప్ప, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.