ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు రాష్ట్రంలో ఎన్నికల వేళ ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం స్థానచలనం పొందారు. ముగ్గురు అధికారులు ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇటీవల ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత స్థానిక పోలీసులతో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పదే పదే ఫోన్‌లో మాట్లాడారని ... తన ముందే కడప ఎస్పీకి పలుమార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని... వివేకా హత్య జరిగిన రోజున జగన్ వెల్లడించారు. తమ బాబాయిహత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఐపీఎస్ ఉన్నతాధికారుల సాయంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఈసీకివైకాపా ఫిర్యాదు చేసింది. వైకాపా నేత విజయసాయిరెడ్డి నిన్న కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.