పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన మహిళలు జూట్ బ్యాగుల తయారీలో పురోగతి సాధిస్తున్నారు. ప్లాస్టిగ్ బ్యాగులను సమాజానికి దూరం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ జూట్ బ్యాగుల తయారీ అనేకమంది గిరిజన మహిళలకు వరంగా మారింది. వారంతా సంఘాలుగా ఏర్పడి బ్యాగులు తయారుచేస్తూ ఉపాధి పొందడమే కాక.. పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నారు.
పశ్చిమగోదావరిజిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్ పురం ప్రాంతంలో గిరిజన మహిళలు జూట్ బ్యాగుల తయారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఐటీడీఏ( గిరిజన అభివృద్ధి సాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఈ యూనిట్లు నెలకొల్పారు. గిరిజన గ్రామాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేసి.. వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్లాస్టిగ్ వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా జూట్ బ్యాగుల తయారీ యూనిట్లు పుట్టుకొచ్చాయి. 5 నుంచి 10 మంది మహిళలు సంఘాలుగా ఏర్పడి బ్యాగులు తయారుచేస్తారు. ఐటీడీఏకు చెందిన గిరిజన యువత శిక్షణ సంస్థ ఈ యూనిట్లను పర్యవేక్షిస్తోంది. యూనిట్ నెలకొల్పాలనుకొన్న మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. జూట్ బ్యాగుల తయారీ, మార్కెటింగ్ అంశాల్లో మెళకువలు నేర్పిస్తారు. కుట్టుమిషన్లు, యంత్రాలు, ముడిసరకు ఐటీడీఏ అందిస్తుంది. ముడిసరకు నగదు మహిళల నుంచి తీసుకుని.. బ్యాగులు మార్కెటింగ్ చేశాక ఖర్చులు తీసివేసి లాభాలను వారికి అందిస్తారు. వీటివల్ల తమ కుటుంబాలను పోషించుకోగలుగుతున్నామని మహిళలు ఆనందం వ్యక్తంచేశారు.
సొంతంగా మార్కెటింగ్