Tobacco Farmers Affected By Untimely Rains : అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. వర్షాల కారణంగా వరి పండించిన రైతులు ఓ వైపు దిక్కు తోచని స్థితిలో ఉండగా.. మరోవైపు వాణిజ్య పంటలు సాగు చేసిన రైతులు సైతం సర్వం కోల్పోయారు. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి పంటలపై పెట్టుబడి పెట్టిన రైతులు.. వర్షం కారణంగా పూర్తిగా పంట నష్టపోగా.. ఇప్పుడు ప్రభుత్వం అందించే సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేసిన అధికారులు నెలలు గడిచినా పరిహారం అందించకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
వందలాది ఎకరాల్లో పొగాకు నష్టం :ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల పుట్టిముంచుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాలం కాని కాలంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే వరితో పాటు వాణిజ్య పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. మార్చి రెండో వారంలో కురిసిన అకాల వర్షంతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో వందలాది ఎకరాల్లో పొగాకుకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా పొగాకు మొక్కల నుంచి ఆకులు రాలిపోవడం సహా మొక్కలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన ఆకులు కూడా చిరిగిపోవడం, మచ్చలు రావడంతో నాణ్యత దారుణంగా పడిపోయింది.
పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి : జంగారెడ్డిగూడెం మండలం చిన్నంవారి గూడెంలో రైతులు విస్తృతంగా పొగాకు చేస్తున్నారు. ఎకరాకు సుమారు లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు అకాల వర్షంతో సర్వస్వం కోల్పోయారు. ఉన్నదంతా పెట్టుబడి రూపంలో పొగాకుపై పెడితే వర్షం రూపంలో తుడిచిపెట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష రూపాయల పెట్టుబడిలో కనీసం సగం కూడా రాదని రైతులు వాపోతున్నారు.
పరిహారం అందిన దాఖలాలు లేవు : వర్షాలతో రాలిపోయిన ఆకులను కూలీలతో ఏరి, వాటిని బ్యారెన్కు తరలించి క్యూరింగ్ చేయించి గ్రేడింగ్ చేయడానికే ఎకరాకు 30 వేల రూపాయలు ఖర్చవుతుందని, కనీసం ఆ 30 వేల రూపాయలు కూడా మిగిలే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. పంట నష్టం అంచనాలు రూపొందించడం కోసం వచ్చిన అధికారులు వివరాలు నమోదు చేసుకుని రెండు నెలలు గడిచినా ఇప్పటికీ పరిహారం అందిన దాఖలాలు లేవని రైతులు వారి గోడు వెల్లబోసుకుంటున్నారు.