TDP Rythu Poru Bata Program in AP: కోనసీమ జిల్లా మండపేటలో రైతు సమస్యలపై తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన పోరుబాటు సదస్సు ముగిసింది. ఈ సమావేశానికి.. 34 నియోజకవర్గాల నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ధాన్యానికి దక్కని మద్దతు ధర, రైతులకు అందని వ్యవసాయ పరికరాలు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందని పరిస్థితులపై తమ గళాన్ని వినిపించారు.
గోరంట్ల బుచ్చయ్య:రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే నాథుడే లేడంటూ తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ధర స్థిరీకరణకు రూ.3 వేల కోట్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు ఎన్ని పూర్తిచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో.. తుపాను రాబోతోందని.. ఆ తుఫాన్లో వైకాపా ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయమని గోరంట్ల జోస్యం చెప్పారు.
ప్రత్తిపాటి పుల్లారావు:ధాన్యం కొనుగోలు చేసి.. రైతులకు డబ్బులు ఇవ్వట్లేదని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. తెదేపా హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో వ్యవసాయ రంగంపై సమీక్షలు జరపడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ మంత్రి ఎక్కడ ఉన్నారో తెలియని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని విమర్శించారు.