ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజప్ప రాజసమా..? తోటవాణి విజయమా...? - తెదేపా

ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా.. డిప్యూటీ సీఎంగా ఉన్న చినరాజప్పపై సిట్టింగ్ ఎంపీ నరసింహం భార్య తోట వాణి పోటీ చేస్తున్నారు. చినరాజప్ప స్థానికేతరుడంటూ.. తోటవాణి చేస్తున్న ప్రచారం.. ఎంతవరకూ పనిచేస్తోంది..? పెద్దాపురంలో పాగావేసేదెవరు.? మరోసారి రాజప్ప రాజసం చూపుతారా..? లేక తోటవాణి విజయం సాధిస్తారా..?

పెద్దాపురం విజేత ఎవరు..?

By

Published : Mar 25, 2019, 7:00 AM IST

Updated : Mar 25, 2019, 4:59 PM IST

ఒకవైపు ఉపముఖ్యమంత్రి..మరోవైపు ఎంపీ సతీమణి. ఈ ఇద్దరిది ఓకే సామాజిక వర్గం కావటంతో పోటీ రసవత్తరంగా మారింది. అభివృద్ధి కలిసొస్తుందని తెలుగుదేశం..సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని వైకాపా..బలమేంటో చూపిస్తామని జనసేన కాలు దువ్వుతోంది. పెద్దాపురంగడ్డపై బిగ్ ఫైట్ నడుస్తోంది.

పెద్దాపురం విజేత ఎవరు..?

1955 నుంచి 2014
1955లో ఏర్పడిన పెద్దాపురం నియోజకవర్గంలో లక్షా 98వేల పైచిలుకున్న కాపు, బీసీ, ఎస్సీల కీలకం. ఇప్పటి వరకు తెదేపా, కాంగ్రెస్ చెరో ఐదుసార్లు గెలుపొందగా..సీపీఐ 2సార్లు, ప్రజారాజ్యం ఓసారి జెండా ఎగరేశారు. 2014 ఎన్నికల్లో కోనసీమకు చెందిన చినరాజప్ప అనూహ్యంగా పెద్దపురం బరిలో నిలిచి, వైకాపా అభ్యర్థి తోట సుబ్బారావునాయుడుపై 10వేల 663 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉపముఖ్యమంత్రి అయ్యారు.

విజయంపై చిన రాజప్ప ధీమా
నియోజకవర్గం రూపు రేఖలే మార్చారు చినరాజప్ప. పెద్దాపురం, సామర్లకోటలో సుమారు రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఎన్టీఆర్ భరోసా ఇళ్లు పేదలకు అందించి వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అసంతృప్తి నేత బొడ్డు భాస్కరరామారావు బజ్జగించారు

వైకాపా 'వాణి' వినిపించేనా..!
చిన్నరాజప్పకు పోటీగా చివరి నిమిషంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణిని వైకాపా బరిలోకి దింపింది. తెదేపాలో జగ్గంపేట టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన తోట ఫ్యామిలీ చివరకు జగన్ వైపు మళ్లారు.
తెలుగు దేశంలో ఉన్నప్పుడు చినరాజప్ప చిన్న చూపు చూశారని, తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రతీకారం తీర్చుకునేందుకు పోటీకి దిగుతున్నట్లు ఆమె ప్రకటించారు.

పవన్ గాలి వీస్తుందా..!
పెద్దాపురంలో పవన్ కల్యాణ్​కి ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇక్కడి నుంచి తుమ్మల బాబును పవన్ బరిలోకి నిలిపారు. జనసేన కూడా పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్, భాజపా, స్వతంత్రులు బరిలో ఉన్నా....తెదేపా, వైకాపా మధ్యే పోటీ నెలకొంది. ప్రజలు తమకే పట్టం కడతారని తెదేపా శ్రేణులు ధీమాగా ఉన్నాయి. వైకాపా మాత్రం సెంటిమెట్ కలిసొస్తుందన్న ఆశతో ఉంది.

Last Updated : Mar 25, 2019, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details