ఏలూరులో వింత మూర్ఛ వ్యాధికి గల కారణాలు వైద్య నిపుణులకూ అంతుచిక్కడం లేదు. వరుసగా మూడో రోజూ జాతీయ పరిశోధనా సంస్థల నిపుణులు రోగుల రక్త నమూనాలతో పాటు...నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆహార పదార్ధాల నమూనాలను సేకరించారు. ఏలూరుకు సరఫరా అవుతున్న నీటి వ్యవస్థను పరిశీలించి....నమూనాలను తీసుకున్నారు. డబ్యూహెచ్‌వో ప్రతినిధి బృందంతో పాటు ఎన్సీడీసీ, పూణే వైరాలజీ ల్యాబ్ , ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు క్షేత్రస్థాయిలో నమూనాలు సేకరించారు. ఎన్సీడీసీ బృందం స్థానికంగా ఉన్న పశువుల్లోనూ సీసం ఆనవాళ్లు ఉండే అవకాశాలపై దృష్టిసారించింది. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం, నికెల్ లాంటి భార లోహాలు అధిక స్థాయిలో ఉన్నట్టుగా ఎయిమ్స్ రెండో సారి విడుదల చేసిన నివేదికలోనూ వెల్లడైంది. పూర్తి స్థాయి నివేదికకు మరో రెండ్రోజుల సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది.
పండ్లు, కూరగాయలపై పిచికారీ చేసిన పురుగుమందుల కారణంగా అర్గానిక్ క్లోరైడ్ కలుషితమై ప్రజలు ఆస్వస్థత బారిన పడి ఉండవచ్చని జాతీయ పరిశోధనా సంస్థ నిపుణులు అనుమానిస్తున్నారు. సీసం, నికెల్ లాంటి భార లోహాలు రక్తంలో మిళితమై..ఈ తరహా అస్వస్థత కలిగేందుకు నెలల సమయం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆర్గానో క్లోరిన్ శరీరంలోకి వెళితే మూర్ఛ , తలనొప్పి, తల తిరగడం, వాంతులు, వికారం, అవయవాలు కొట్టుకోవడం, వణకడం తికమకగా వ్యవహరించడం చెమటలు పట్టడం వంటి లక్షణాలు బయటపడతాయని చెబుతున్నారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా చల్లిన క్లోరిన్ , బ్లీచింగ్లు కూడా ఈ తరహా వింత మూర్చ వ్యాధికి కారమై ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అనుమానిస్తున్నారు.
వాస్తవానికి ఏలూరులో హఠాత్తుగా ఉత్పన్నమైన మూర్ఛ వ్యాధికి సంబంధించిన కేసులు నవంబరు 22 తర్వాత వచ్చినట్లుగా తెలుస్తోంది. నగరంలోని దక్షిణపు వీధి, పడమర వీధి, జేపీ నగర్ కాలనీ ప్రాంతాల్లో ఒకరిద్దరికి ఈ తరహా మూర్ఛ వచ్చినట్టు సమాచారం. వీరు స్థానిక వైద్యుల దగ్గరకే వెళ్లిచికిత్స చేయించుకున్నారని తెలుస్తోంది. డిసెంబరు 4న ఒకేసారి వందల సంఖ్యలో కేసులు వెలుగుచూడడం వల్ల ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.