పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సమధిలవుతున్నారు. గ్రామాలను ఖాళీ చేసి.. పొట్టచేతపట్టుకొని.. ఇతర ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. అలాంటి వారికి కుటుంబ పునరావసం కింద ప్రభుత్వం ఆరున్నర లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. 18ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. భార్య, భర్త, 18ఏళ్ల లోపు పిల్లలు ఎందరు ఉన్నా..ఆరున్నర లక్షల రూపాయలు అందిస్తారు. కుటుంబంలో పిల్లలు మేజర్లైతే..వారికి సైతం ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. 2017జూన్ 5 వరకు మేజర్లైన వారికి మాత్రమే ఈ కుటుంబ ప్యాకేజీ వర్తిస్తుందని నిబంధనలు తెచ్చారు. అప్పట్లో తయారు చేసిన జాబితా ప్రకారం మాత్రమే ఆర్థిక సాయం అందిస్తున్నారు.
2017 తర్వాత నిర్వాసిత గ్రామాల్లో 18ఏళ్లు నిండిన వారికి ఈ ప్యాకేజీ వర్తించడం లేదు. ఈ మూడేళ్ల కాలంలో వేల మంది నిర్వాసిత గ్రామాల్లోని పిల్లలకు 18ఏళ్లు నిండాయి. ఎంతో మంది పెళ్లిళ్లు సైతం చేసుకొన్నారు. కానీ వారికి పునరావాస ప్యాకేజీ లేక ...నష్టపోతున్నారు. గ్రామాలను ఖాళీ చేసిన తేదీని ఆఖరు తేదీగా పరిగణించాలని నిర్వాసితులు గ్రామసభల్లో తమ అభిప్రాయాలను వెలిబుచ్చినా....వారి అభ్యర్థనను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.
పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లో 39ఊళ్లను ముంపు గ్రామాలుగా గుర్తించారు. వీటిలోని 30వేల కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ అమలు కావాల్సి ఉంది. నిర్వాసితులకు అవసరమైన ఇళ్లు , భూ పరిహారం, కుటుంబ పునరావాస ప్యాకేజీకి సంబంధించిన జాబితాను అధికారులు మూడేళ్ల కిందటే సిద్ధం చేశారు. కానీ నిర్వాసితులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. ఇతర పునరావాస కార్యక్రమాలు సైతం చేపట్టలేదు. నగదు చెల్లించలేదు కాబట్టి.. గ్రామాలను ఖాళీ చేయించిన రోజునే కుటుంబ పునరావాస ప్యాకేజీకి ఆఖరు గడువు తేదీగా పరగణించాలని నిర్వాసితులు కోరుతున్నారు.