అది గోదావరి నది... పశ్చిమగోదావరి జిల్లా సింగనపల్లి సమీపంలో వారం క్రితం హఠాత్తుగా హడావుడి ప్రారంభమైంది. అలంకరించిన పడవలు, పెద్ద పెద్ద లాంచీలు నదిలో కనపడటంతో ఆ పరిసర ప్రాంతాల్లో చర్చ జరిగింది. పాపికొండల పడవ ప్రమాదం తర్వాత పర్యాటకానికి పడవలకు, లాంచీలకు అధికారులు అనుమతి నిలిపివేయడంతో నదిలో ప్రయాణాలు ఆగిపోయాయి. ఎవరైనా ధైర్యం చేసి వెళ్లినా జరిమానాలు విధిస్తున్నారు. అలాంటిది ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు అనుమతి ఇచ్చారని పరిశీలిస్తే ఒక భారీ సినిమా ప్రాజెక్టు కోసం వాటికి అనుమతిచ్చారని తేలింది. నాలుగు రోజుల పాటు ఒక ప్రముఖ దర్శకుడు, ఒక ప్రముఖ బాలీవుడ్ నటితో అక్కడ సినిమా చిత్రీకరణ జరిగింది. దీంతో పాపికొండలు బోట్ ఓనర్సు, వర్కర్సు అసోసియేషన్ ఆగ్రహించి జిల్లా కలెక్టర్‌కు, జలవనరులశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ రంగంపై ఆధారపడి పది వేల మంది జీవిస్తున్నామని, తమకూ పడవలు నడిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ లేఖ పెట్టడంతో ఇది గడబిడకు దారి తీసింది.
2019 సెప్టెంబరు 15న వరదల సమయంలో పాపికొండల ప్రయాణానికి వెళ్లిన లాంచీ గోదావరిలో మునిగిపోయి 79 మంది మరణించారు. అప్పటి నుంచి పాపికొండల్లో పర్యాటకానికి, జల రవాణాకు జలవనరులశాఖ అనుమతులు నిలిపివేసింది. బేతిమెట్రిక్ సర్వే (నదుల లోతులు పరీక్షించేది) చేసి ఏ మార్గంలో పడవలు, లాంచీలు ప్రయాణించడం క్షేమకరమో తేల్చాకే వాటికి రూటు అనుమతి ఇస్తామనడంతో 16 నెలలుగా ఇక్కడ పర్యాటకం ఆగిపోయింది. ఇంతలో షూటింగుకు అనుమతి ఇవ్వడం గొడవకు కారణమైంది.