ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం సవరించిన అంచనాలు అధ్యయనం చేయాలి: కేంద్రమంత్రి - polavaram project latest news

పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని 2013-14 నాటి ధరలకు మించి పెంచడం కుదరదని..ఆర్థికశాఖ కేబినెట్‌ నోట్‌లో ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టంచేశారు. సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 2017 నాటి ధరల ప్రకారం రివైజ్డ్‌ ఎస్టిమేట్‌ కమిటీ తయారుచేసిన అంచనాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

గజేంద్రసింగ్ షెకావత్
minister gajendra singh shekhawat on polavaram project

By

Published : Feb 8, 2021, 1:21 PM IST

Updated : Feb 9, 2021, 5:47 AM IST

పోలవరం అంశంపై సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా ఎంపీ జీవీఎల్. నరసింహారావు, కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ అడిగిన ప్రశ్నలకు.... కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చులను ఏపీ ప్రభుత్వానికి తిరిగి చెల్లించే విధానాన్ని క్రమబద్ధీకరించే విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ... 2020 మే 5న ముఖ్యమంత్రి లేఖ రాశారని షెకావత్ సభ దృష్టికి తెచ్చారు. సాగునీటి కోసం చేసిన ఖర్చులకు బిల్లులు అందిన తర్వాత... ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘాల సిఫార్సుల ఆధారంగా 2014 ఏప్రిల్‌ 1 నుంచి కేంద్రం తిరిగి చెల్లిస్తూ వస్తోందన్నారు. కేంద్ర ఆర్థికశాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్న తర్వాత దీర్ఘకాల సాగునీటి నిధి కింద నాబార్డు నుంచి ఎక్స్‌ట్రా బడ్జెటరీ రిసోర్స్‌ రూపంలో సేకరించిన నిధులను ఇస్తున్నామన్నారు. జలశక్తి శాఖ నుంచి విజ్ఞప్తి వెళ్లిన రెండు, మూడు వారాల్లోనే నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీకి నాబార్డు నిధులు బదిలీ చేస్తోందని చెప్పారు. ఆ తర్వాత ఒకటి రెండు పనిదినాల్లోనే పోలవరం ప్రాజెక్టు అథారిటీ AP ప్రభుత్వానికి బదలాయిస్తోందన్నారు. ఇదే అంశాన్ని గతేడాది జులై 6న ముఖ్యమంత్రికి రాసిన లేఖలో చెప్పామని గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు.

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి

రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ సవరించిన అంచనాల ప్రకారం 47 వేల 725 కోట్ల రూపాయల వ్యయమవుతుందని సిఫార్సు చేసినట్లు గతేడాది మార్చిలో కేంద్రమంత్రి లోక్‌సభలో చెప్పారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. 2017-18 ధరల ప్రకారం 55 వేల 657 కోట్లకు సాంకేతిక సలహా సమితి అనుమతి మంజూరు చేసిందన్నారు. టీఏసీ ఆమోదించిన సవరించిన మొత్తానికి కేంద్రం ఎప్పుడు అనుమతి మంజూరు చేస్తుందని ప్రశ్నించారు. విభజన చట్టం కింద పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందని షెకావత్‌ తెలియజేశారు. 2013-14 ధరల స్థాయి ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేస్తామని... ఆ తర్వాత ధరల పెంపునకు అనుమతివ్వబోమని ఆర్థికశాఖ కేబినెట్‌ నోట్‌ సిద్ధం చేసినట్లు చెప్పారు. రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ 2017 ధరల ప్రకారం ప్రాజెక్టు తదుపరి ఖర్చును లెక్కించిందని... దీనిపై ఆలోచించి మంత్రివర్గం వద్దకు పంపుతారన్నారు. కేబినెట్‌ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టంచేశారు.

వచ్చే ఏడాది కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ భావిస్తున్నారని..కానీ నిధుల విడుదలలో ఎదురవుతున్న సమస్య పనుల పురోగతిపై పడుతోందని విజయసాయి అన్నారు. సీఎం సూచించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్ద కేంద్రం రివాల్వింగ్‌ ఫండ్‌ను ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. నిధుల విడుదలలో ఎలాంటి ఇబ్బందీ లేదన్న షెకావత్‌... పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పుడే రీఎంబర్స్‌ విధానంలో ఖర్చులు చెల్లించాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు. కేంద్రం ఎల్​టీఐఎఫ్ రూపంలో నాబార్డు ద్వారా నిధులు సమీకరించి రాష్ట్రానికి ఇస్తోందన్నారు. ప్రభుత్వం బిల్లులు సమర్పించగానే డబ్బులు విడుదల చేస్తున్నామని స్పష్టంచేశారు. పునరావాసం, పునర్నిర్మాణం వంటి కొన్ని విషయాల్లో రాష్ట్రం మరింత వేగంగా పనిచేయడంపై దృష్టిపెడితే... సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అప్పుడే ముఖ్యమంత్రి ఆశించినంత వేగంతో పనులు పూర్తిచేయడానికి వీలవుతుందని అన్నారు.

కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు 10వేల 848 కోట్లు విడుదల చేసినందుకు ప్రధాన మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పటికల్లా సిద్ధమవుతుందని రాజ్యసభలో ప్రశ్నించారు. స్పిల్‌వే పనులు వచ్చే మూడు నెలల్లో పూర్తవుతాయన‌్న షెకావత్‌.... కాఫర్‌ డ్యాం పనులయ్యాక 41 మీటర్ల ఎత్తున ఒకేసారి నీరు నిల్వ చేయవచ్చన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పునరావాసాన్ని ఎంత వేగంగా పూర్తిచేస్తుందన్నదానిపై ప్రాజెక్టు పురోగతి ఆధారపడి ఉంటుందన్నారు. పోలవరం పునరావాసంలో ఆలస్యానికి కారణమేంటని కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌సింగ్‌ ప్రశ్నించారు. ప్రాజెక్టు కింద ఎంత భూభాగం ముంపునకు గురవుతుందో చెప్పగలరా అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు బదులిచ్చిన షెకావత్... దాదాపు లక్ష ఎకరాలు ముంపునకు గురవుతుందని గుర్తించామన్నారు. తొలిదశలో 41 మీటర్ల ఎత్తున నీరు నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే మొత్తం కుటుంబాల్లో... ఇప్పటివరకు 35 శాతం కుటుంబాలను మాత్రమే తరలించారని చెప్పారు. ప్రాజెక్టు కింద లక్షా 5 వేల 601 కుటుంబాలు ముంపునకు గురవుతుంటే...కేవలం 3 వేల 922 కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు వివరించారు.

తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర, భాజపా సభ్యులు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు..మంత్రి షెకావత్‌ సమాధానమిచ్చారు. ప్రాజెక్టు కోసం 1.67 లక్షల ఎకరాల భూమి అవసరమవగా... ఇప్పటివరకు 1.11 లక్షల ఎకరాలు సేకరించినట్లు చెప్పారు. భూసేకరణ, పునరావాస పనులకు 6వేల 583 కోట్లు ఖర్చు పెట్టారన్న ఆయన..ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ప్రతిపాదన లేదన్నారు. 2022 ఏప్రిల్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. భూసేకరణ సమస్యలు, గతంలో కాంట్రాక్ట్‌ సంస్థలు సరిగా పనిచేయకపోవడం వల్ల పనుల్లో కొంత జాప్యం జరిగినట్లు రాష్ట్రం తమ దృష్టికి తీసుకొచ్చిందన్నారు.

ఇదీ చదవండి

ఇదీ సంగతి: చెన్నైలో రోజు వారీ కూలీ..తొలి స్థానంతో నెల్లూరులో సర్పంచి

Last Updated : Feb 9, 2021, 5:47 AM IST

ABOUT THE AUTHOR

...view details