రాష్ట్ర ఎన్నికల సంఘ నిర్ణయంతో పంచాయతీ సమరంపై జిల్లాలోని పల్లెల్లో జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు. ఈ నెల 9 నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5, 7, 9, 17 తేదీల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ జారీతో గ్రామాల్లో రాజకీయం వేెడెక్కనుంది.
ఇదీ పరిస్థితి : ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పంచాయతీలు వారీగా తయారు చేసిన తుది ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రచు రించారు. వార్డుల్లో కులాల వారీగా జాబితాను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 909 గ్రామ పంచాయతీలు, 9752 వార్డులు ఉన్నాయి. వీటిలో పోలవరం ప్రాజెక్టు పరిధిలో మామిడిగొందు, పైడిపాక గ్రామాలు డీనోటిఫై అయ్యాయి. ఆకివీడు మేజరు పంచాయతీ నగర పంచాయతీగా మారింది. వీటితో పాటు మరో 19 పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు.
ఈ విధంగా 22 పంచాయతీలను మినహాయించగా.. జిల్లాలో మరో 12 కొత్తగా పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిన్నింటినీ కలిపితే 899 పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల కొన్ని పురపాలక సంఘాల్లో నాలుగు పంచాయతీలు విలీనం కావడంతో 895 పంచాయతీలకు రిజర్వేషన్ పూర్తయి ఎన్నికలకు సిద్ధమయ్యాయి. పునర్విభజనలో భాగంగా ఆయా మండలాల్లో 1,33,349 ఓట్ల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం జిల్లాలో 24,17,567 మంది ఓటర్లు ఉన్నారు. కరోనా, వ్యాక్సిన్ పంపిణీ తదితర కారణాలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం సుముఖంగా లేదు. దీంతో ఎన్నికలు జరుగుతాయో లేదో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తం ఓటర్లు: 24,17,567