ప్రతీ రైతు.. వ్యాపారవేత్తలా ఆలోచించాలి: లక్ష్మీనారాయణ - interaction
మన రాష్ట్రంలో రైతులు కొబ్బరిబోండాన్ని అయిదు నుంచి ఆరు రూపాయలకు అమ్ముకుంటారు. అదే కేరళలో ఒక్క బోండంపై 2 వందల రూపాయలు సంపాదించగలరు. రైతులు ఆలోచనా ధోరణిని మార్చుకుని కలసికట్టుగా అడుగువేయాలి. ప్రతి రైతు ఓ వ్యాపారతవేత్తలా ఆలోచించాలి: వీవీ లక్ష్మీనారాయణ
![ప్రతీ రైతు.. వ్యాపారవేత్తలా ఆలోచించాలి: లక్ష్మీనారాయణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3306180-760-3306180-1558079932223.jpg)
యువతను వ్యవసాయరంగం వైపు మళ్లించి ఆ రంగాన్ని లాభసాటిగా చేయాలనే లక్ష్యంతో తాను రైతులతో మమేకమవుతున్నట్లు జనసేన పార్టీ నాయకుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి, ఉసులుమర్రు గ్రామాలలో జరిగిన రైతు అవగాహన సదస్సుకు ఆయన హాజరై పలు సూచనలు చేశారు. రైతులు గిట్టుబాటు ధరలు సాధించేందుకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు కొబ్బరి బోండాన్ని అయిదు నుంచి ఆరు రూపాయలకు అమ్ముతుంటే.. కేరళలో బోండం రెండు వందల యాభై రూపాయలు తెచ్చిపెడుతోందన్నారు. రైతులందరినీ కలపి ప్రొడ్యూసింగ్ కౌన్సిల్ అనే ఒక కంపెనీగా ఏర్పడి వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మూకుమ్మడిగా కొనుగోలు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల ఉత్పత్తులను ఆ కంపెనీయే కొనుగోలు చేస్తుందని వివరించారు. కంపెనీ తాను కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వచేసి అమ్మటం ద్వారా లాభసాటి ధర పొందగలుగుతారని చెప్పారు. ఈవిధానాన్ని ప్రయోగాత్మకంగా గుంటూరుజిల్లా బాపట్ల సమీపంలోని యాజిలి అనే గ్రామంలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతులు కూడా వ్యాపారధోరణిలో ఆలోచించాలని ఆయన సూచించారు. పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కార్యక్రమంలో వివరించారు.