గోదావరి వరద ఉధృతి ముప్పుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణంతో గోదావరి వరద ప్రభావం ఎలా ఉండబోతుందనేది అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే 60 శాతం పనులు పూర్తైన ఎగువ కాఫర్ డ్యాంను వరదతాకిడికి తట్టుకునేలా చర్యలు చేపడుతున్నారు.
గోదావరి నది పరివాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే గోదావరిలోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. 25వేల క్యూసెక్కుల వరదనీరు గోదావరిలో కలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే పోలవరం నిర్మాణ ప్రాంతంలో అధికారులు, గుత్తేదారులు, ఇంజినీర్లు అప్రమత్తమయ్యారు. గతంలో వచ్చిన గోదావరి వరదలకు.. ఇప్పటికీ తేడా ఉంది. గతంలో గోదావరికి ఎంత వరద వచ్చినా... సజావుగా ప్రవాహం ఉండేది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. గోదావరి మధ్యలో 35 మీటర్ల ఎత్తుతో కాఫర్ డ్యాం నిర్మించి... ఇరువైపుల నిర్మించకుండా వదిలేశారు.
కాఫర్ డ్యాం కుడివైపు 2 వందల మీటర్లు, ఎడమవైపు 2 వందల మీటర్ల వెడల్పుతో ఖాళీగా వదిలేశారు. ఈ 400 మీటర్ల పరిధిలోనే గోదావరి నది ప్రవహించాల్సి ఉంటుంది. నదిలో వచ్చిన నీరు డ్యాంను తాకి.. వెనక్కువెళ్లి.. ఇరువైపుల ఉన్న ఖాళీ ప్రాంతాల నుంచి కిందకు వెళ్లాలి. ప్రస్తుతం వస్తున్న వరద ప్రవాహానికైతే.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. గోదావరినదిలో ప్రవాహం లక్ష క్యూసెక్కులు దాటితే వరద వెనక్కు ఎగదన్నే ఆస్కారముంది.