ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వదిలి వెళ్లలేక... ఉన్నచోట బతకలేక - floods in west godavari

గోదావరి జిల్లాల్లోని ముంపుగ్రామాలది ప్రతిఏటా ఇదే దీనస్థితి. గోదారమ్మ ఎప్పుడు... ఎలా విరుచుకుపడే తెలియక ప్రజలు కంటిమీద కునుకులేకుండా జీవిస్తున్నారు. 2వారాలుగా ముంపు గ్రామాల ప్రజల బాధలు వర్ణణాతీతం. భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గోదావరి ఉప్పొంగిన ప్రతిసారి పశ్చిమగోదావరి జిల్లాలోని ముంపు గ్రామాలు... జలదిగ్బంధంలో చిక్కుకొంటున్నాయి. అన్నింటిని వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లలేక... ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతుకులీడుస్తున్నారు. పాలకులు తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

వదిలి వెళ్లలేక... ఉన్నచోట బతకలేక

By

Published : Aug 17, 2019, 6:22 AM IST

వదిలి వెళ్లలేక... ఉన్నచోట బతకలేక

వర్షాకాలం వచ్చిందటే చాలు.. పశ్చిమగోదావరి జిల్లాలోని ముంపుగ్రామాల ప్రజలకు కంటిమీద కునుకుఉండదు. ఎప్పుడు వరద ముంచెత్తుతుందోనన్న భయంతో బతుకుతున్నారు. ఈ ఏడాది పోలవరం కాఫర్ డ్యామ్ ప్రభావంతో... వీరి కష్టాలు మరింత పెరిగాయి. జులై 31నుంచి గోదావరి వరద ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లో అనేక గ్రామాలను గోదావరి వరద ముంచెంత్తింది. ఇప్పటికీ కష్టాలు తొలగలేదు. ముంపుగ్రామాల చుట్టు పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రహదారులు, వంతెనలు నీటమునిగాయి. ఈ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

నిత్యావసరాలు, కూరగాయలు, వైద్యం, విద్యార్థుల చదువులు ఇలా అనేక సమస్యలు ఈ గ్రామాలను వెంటాడుతున్నాయి. పలు గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. కొన్ని గ్రామాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం వద్ద కాఫర్ డ్యామ్ 35మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ కాఫర్ డ్యామ్ వద్ద వరద పైకి ఎగదన్ని నీరు గ్రామాల్లోకి వస్తోంది. రోగులు, పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసినా... గ్రామాన్ని వదిలి వెళ్లలేక అవస్థలు పడుతున్నామని ముంపుగ్రామాల ప్రజలు చెబుతున్నారు.

జిల్లాలోని వేలేరుపాడు, పోలవరం మండలాల గ్రామాల్లో వరద ప్రభావం ఈ సారి తీవ్రంగా ఉంది. 22గ్రామాలను తక్షణం ఖాళీ చేయించాలని 2నెలల కిందట ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆచరణలో మాత్రం సాధ్యంకాలేదు. ముంపు గ్రామాల ప్రజలు పొలాలు, పశువులు వదిలి రావడానికి ఇష్టపడలేదు. దీంతో అధికారులు చేసేదేం లేక చేతులెత్తేశారు. వేలేరుపాడు మండలం రేపాకుగొమ్మ, తాటకూరుగొమ్మ, తిరుమలాపురం, నార్లవరం, కటుకూరు, కోయిదా గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. 29గ్రామాల్లోని 10వేల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలవరం మండలంలోని కొండ్రుకోట, తాటగుంట, కొరటూరు పంచాయతీల్లోని 19గ్రామాల ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

వరద తాకిడికి రహదారులన్ని ఛిద్రమయ్యాయి. 15రోజులుగా అనేక అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు ‍‍ఒకసారి ప్రభుత్వం సరఫరా చేసినా... అవి 3రోజలకే పరిమితమయ్యాయి. నిత్యావసరాలు, వైద్యం కోసం అనేక కష్టాల కోర్చి గోదావరిని దాటాల్సి వస్తోంది. వరద ప్రభావం వల్ల.. పశువులకు కూడా చోటు కరవైంది. విద్యార్థులు సమీప పట్టణంలో కళాశాలలకు వెళ్లిరావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో ఈ ఏడాది నుంచి మరో కొత్త కష్టం ప్రారంభమైంది. గోదావరికి చిన్న వరద వచ్చినా... గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకొంటున్నాయి. ప్రభుత్వాలు స్పందించి.. శాశ్వతంగా గ్రామాల నుంచి పంపించాలని ముంపుగ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్యాకేజీలు అందిస్తే... ఈ కష్టాలు నుంచి బయటపడుతామని చెబుతున్నారు.

ఇదీ చదవండీ...

ఏపీలో పెట్టుబడులు పెట్టండి... సీఎం జగన్ ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details