godavari flood: భారీగా పెరిగిన వరద.. పోలవరం స్పిల్ వే నుంచి 7 లక్షల క్యూసెక్కుల విడుదల
08:06 September 09
గోదావరిలో భారీగా పెరిగిన వరద..
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 32 మీటర్లకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 48క్రస్ట్ గేట్ల ద్వారా 7 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 34 మీటర్లకు చేరుకుంది.
పోలవరం, వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో యడవల్లి- బోళ్లపల్లి గ్రామాల మధ్యలోని ఎద్దువాగు వంతెన వరద నీటిలో మునిగిపోగా, వాగు అవతల 17 గ్రామాలకు మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రంకోట- వేలేరుపాడు గ్రామాల మధ్యలోని ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రేపాకగొమ్ము, తిరుమలాపురం, తూర్పుమెట్ట గ్రామాల సమీపంలోని పల్లపు ప్రాంతాల్లో నీరు ఎగపోటు వేసింది. రేపాకగొమ్ము, తిరుమలాపురం, నార్లవరం, కొత్తూరు, చిగురుమామిడి, తూర్పుమెట్ట తదితర గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. పోలవరం మండలం కొత్తూరు వంతెనపై వరద ప్రభావం చూపుతోంది. 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి వరద అనూహ్యంగా పెరగడంతో అధికారులు బుధవారం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని ముంపు గ్రామాలకు తరలించారు.
ఇదీ చదవండి: