మినీ గోకులాలు.... పాడిరైతులకు తెచ్చాయి కష్టాలు
పల్లెల్లో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మినీ గోకులాల పథకం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. 'మీ పశువులకు షెడ్డులు నిర్మించుకోండి... రాయితీ రూపంలో మీకు 15 రోజుల్లో నగదు వస్తుంది' అని పాడి రైతులకు చెప్పిన అధికారులు అనంతరం మెహం చాటేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పాడి రైతులకు గత ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో మినీ గోకులాలను మంజూరు చేసి... నిర్మాణాలు చేపట్టేలా చేసింది. జిల్లా వ్యాప్తంగా 4 వేల షెడ్లు మంజూరు చేసిన ప్రభుత్వం... తొలిదశలో 1200 షెడ్లను పూర్తి చేయించింది. 15 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ చేస్తామని... అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారినా... సొమ్ము రాక లబ్ధిదారులు ఆవేదనకు గురవుతున్నారు. అప్పులు చేసి ఈ షెడ్డులు నిర్మించామని... రాయితీ నగదు జమ కాక కష్టాలు పడుతున్నామని అంటున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం లిభించటం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు అప్పగించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు పశుసంవర్థక శాఖ అధికారులు ఈ నిర్మాణాలు పూర్తి చేయించి చేతులు దులుపేసుకున్నారు. వారిని నమ్మి మినీ గోకులాలను నిర్మించిన పాడి రైతులు... రాయితీ సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.