ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆదివాసీ గూడెంలో అంతుచిక్కని వ్యాధులు

By

Published : Apr 21, 2020, 8:57 PM IST

పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలోని వలస ఆదివాసీ గూడెంలో అంతుచిక్కని వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఫలితంగా అమాయక ఆదివాసీల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కారణం ఎంటో తెలియక తమవారు మరణిస్తుంటే... వారు భయాందోళనకు గురవుతున్నారు. ఏ మహమ్మారి వారి ప్రాణాలు తీస్తుందో తెలియక బిక్కుబిక్కుమని బతుకీడుస్తున్నారు.

Elusive Diseases in the Adivasi Goode in west godavari
ఆదివాసీ గూడెం

ఆదివాసీ గూడెంలో అంతుచిక్కని వ్యాధులు

పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలోని వలస ఆదివాసీ గూడెంలో గడిచిన 20 రోజుల్లో ఐదుగురు మృతి చెందారు. కాళ్లవాపు, ఉదరకోశ సమస్యలతో మిగతావారు అల్లాడిపోతున్నారు. మారేడుబాక గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో చుక్కలొద్ది అనే ఆదివాసీ గుంపు ఉంది. ఇక్కడ 20 కుటుంబాలు తలదాచుకుంటున్నాయి.

గడచిన 20 రోజుల్లో చుక్కలొద్దిలో అంతుచిక్కని వ్యాధులు విజృంభించాయి. కాళ్లవాపు, ఉదరకోశ సమస్యలతో ఆ గుంపునకు చెందిన మడకం అడమయ్య(50), సోడే సోమ(35), మడకం మాడ(35), కొవ్వాసి సోమడ(35), కుంజా గంగమ్మ(35) మృతి చెందారు. మడివి జోగ, వంజం గంగ, వంజం లక్ష్మీ, సోడే చిరమమ్మ అవే సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు రావడానికి కారణాలు ఇంకా తెలియలేదు.

కొన్ని రోజుల కిందట తమవారితో మాట్లాడుతూ... సోమడ అనే వ్యక్తి 3 సార్లు తుమ్మి... 15 నిమిషాల్లోనే చనిపోయాడు. కారణం ఎంటో అధికారులకూ తెలియరాలేదు. సమీపంలో ఉన్న ఆరోగ్య సిబ్బంది ఆ గుంపు ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు. కానీ ఎలాంటి మూలాలు దొరకలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే కూనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జెస్సీ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ వివిధ వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులను తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు వైద్యాధికారి తెలిపారు.

తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అమాయక గిరిజనులు కోరుతున్నారు. ఏదైనా అత్యవసర సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండీ... గుజరాత్‌ ముఖ్యమంత్రికి జగన్‌ ఫోన్‌

ABOUT THE AUTHOR

...view details