పరిషత్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పశ్చిమ గోదావరిలో యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించడానికి ఏ నిమిషంలో గ్రీన్ సిగ్నల్ వచ్చినా సంసిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది, పోలింగ్ అధికారులు ఆ మేరకు సిద్ధమయ్యారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే పోలింగ్ కేంద్ర అధికారులకు బ్యాలెట్ పత్రాలను అందజేశారు. విధులు నిర్వహించవలసిన కేంద్రాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ పై హైకోర్టు ఆంక్షలు విధించింది. కోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అవడంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. భిన్న పరిస్థితుల మధ్య జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో అని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వేచిచూస్తున్నారు.