అట్టహాసంగా ద్వారకా తిరుమల రథోత్సవం - rathotsavam
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. దివ్య మంగళ స్వరూపాన్ని శ్రీనివాసుడు ఉభయదేవేరులతో కలిసి భక్తులకు వరాలు కురిపిస్తూ రథంపై ఊరేగారు. పూలతో అలంకరించిన రథాన్ని అధిరోహించి శ్రీవారు క్షేత్ర వీధుల్లో విహరిస్తుంటే భక్తులు పులకించిపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఆద్యంతం కన్నుల పండువగా జరిగింది. క్షేత్ర పరిసరాలు విద్యుత్ దీప కాంతులను వెదజల్లుతూ ఉండగా... చిన్న వెంకన్న స్వామి , శ్రీదేవి, భూదేవి సమేతుడై సాక్షాత్కరించారు. రథాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో భక్తులను ఆకట్టుకునేలా సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేక వాహనంపై ఊరేగింపుగా రథం వద్దకు తోడ్కొని వచ్చి రథంపై ఆసీనులు గావింప చేశారు. అర్చకులు , పండితులు విశేషంగా అలంకరించి హారతులు ఇచ్చారు. మేళ తాళాలు, సన్నాయి వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛారణలు నడుమ రథ వాహనం తిరువీధుల్లో పయనమైంది. కళ్యాణ శోభతో స్వామి, అమ్మవార్లు రథంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. రథానికి కట్టిన పగ్గాలను లాగేందుకు భక్తులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఈ వేడుక కోలాహలంగా సాగింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు పోటీ పడ్డారు.