పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో ఏఈవోగా పనిచేస్తున్న బీ.వీ.ఎస్. రామాచార్యులు తన నివాసంలో గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనపై దేవస్థానం ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. రామాచారి మృతికి ఆలయ ఈవో జీ.వీ.సుబ్బారెడ్డి వేధింపులే కారణమని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తమ విధులకు మూకుమ్మడి సెలవులు పెట్టారు.
అనంతరం స్వామివారి పాదుకా మండపం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నేలపై కూర్చుని ఆలయ ఈవో తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ.వో.సుబ్బారెడ్డి కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారని ఆవేదన చెందారు. గుండెపోటుతో మృతి చెందిన ఏఈవో రామాచారిని వ్యక్తిగతంగా దూషించారని, ఆ కారణంతో ఆయన తీవ్ర మనస్థాపం చెంది గుండెపోటుకు గురై మరణించారని మండిపడ్డారు. ఈవో సుబ్బారెడ్డి తన ప్రవర్తనను మార్చుకోవాలని కోరారు. పరిపాలనపై అవగాహన లేకుండా ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్న ఈవో ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.