భారీ వర్షంతో నీట మునిగిన పంటలు.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రావడానికి ప్రతి ఏటా రైతు కన్నీళ్లు పెట్టాల్సి వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సార్వా సాగు కాస్త ఆలస్యమైనా ఆకు మడులు వేశారు. ఇప్పుడిప్పుడే వరి నాట్లు కూడా వేయడం ప్రారంభించారు. ఇంతలోనే గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వరి పొలాలలన్నీ ముంపునకు గురయ్యాయి. ఎగువ నుంచి నీరు ఇంకా వస్తుండడంతో కాలువలల్లో చేరిన మురుగు నీరు దిగువకు వెళ్లకపోవడంతో నారు మడులతోపాటు... వరినాట్లు వేసిన పొలాలు కూడా ముంపు బారిన పడ్డాయి. సుమారు 1137 ఎకరాలు నారుమళ్ళు నీటిలో నానుతున్నాయి. 9667 ఎకరాల్లో వరి నాట్లు వేసిన పొలాలన్నీ మునిగిపోయాయి.