Death Toll in Jangareddygudem:పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు భయపెడుతూనే ఉన్నాయి. శనివారం మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించడంతో నాలుగు రోజుల వ్యవధిలో మృతుల సంఖ్య 18కి చేరింది. సారా తాగే అలవాటున్న నలుగురు అనారోగ్య కారణాలతో ఉదయం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరిలో ఉప్పలమెట్టకు చెందిన వెంపల అనిల్ కుమార్ (35), గౌరీశంకరపురానికి చెందిన సునాని ఉపేంద్ర (30) గంటన్నరలోనే కన్నుమూశారు. మృతుడు అనిల్ సోదరుడు సర్వేశ్వరరావు, మరొకరు బొల్లా నేతాజీల ఆరోగ్యం నిలకడగా ఉంది.
‘మా ఆయన బైక్ మెకానిక్‌గా పని చేస్తారు. రోజూ నాటు సారా తాగుతారు. ఆరోగ్యం పాడవుతుందని చెప్పినా వినేవారు కాదు. ఆయనకు అంతకుముందు ఎలాంటి అనారోగ్యం లేదు. శనివారం పొద్దున్నే వాంతులయ్యాయి. ఆకస్మికంగా పల్స్ పడిపోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చాక చనిపోయారు. ఆయన మృతికి నాటు సారానే కారణం’ అని అనిల్ కుమార్ భార్య లావణ్య రోదించారు. ‘నా భర్త మార్బుల్ పని చేస్తారు. ఆయనకు నాటుసారా తాగే అలవాటుంది. సోమ, మంగళవారాలు బాగా తాగారు. శుక్రవారం సాయంత్రం నుంచి నీరసంగా ఉందని చెప్పారు. రాత్రి నుంచే వాంతులవుతున్నాయి. శనివారం పొద్దున్నుంచి కళ్లనొప్పులు మొదలయ్యాయి.
ఆసుపత్రికి తీసుకొచ్చాక కాసేపటికే చనిపోయారు’ అని ఉపేంద్ర భార్య ప్రియ విలపించారు. కారణాలను విశ్లేషిస్తున్నామని, అందరూ ఒకే అనారోగ్య సమస్యతో చనిపోయినట్లు ధ్రువీకరించలేమని జిల్లా వైద్యాధికారి రవి తెలిపారు. వారంతా సారా తాగడంవల్లే చనిపోయారని చెప్పలేమని వెల్లడించారు. విచారణలో భాగంగా ఖననం చేసిన ఒకరి మృతదేహాన్ని అధికారులు శనివారం వెలికితీశారు. కల్తీ సారా వల్లే తన భర్త చనిపోయారని, స్పష్టతనివ్వాలని మడిచెర్ల అప్పారావు భార్య వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
తెదేపావి శవ రాజకీయాలు: మంత్రి ఆళ్ల నాని
నాటు సారా కలకలం వెనుక రాజకీయ కారణాలున్నాయని మంత్రి ఆళ్ల నాని వివరించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఆయన బాధితులను పరామర్శించారు. వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారి కుటుంబీకులకు పరిహారం వస్తుందని తెదేపా నాయకులు ప్రలోభపెట్టి ఇదంతా చేయిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రేపోమాపో ఇక్కడికి చంద్రబాబు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.
‘ఆసుపత్రుల రికార్డుల ప్రకారం జంగారెడ్డిగూడెంలో వారం రోజులుగా మరణించిన వారి సంఖ్య ఐదు. వారిలో ఒకరు గుండెపోటుతో మరణించగా.. మిగిలిన నలుగురు అతిగా మద్యం తాగడంతో చనిపోయారు. వివిధ కారణాలతో ఇళ్లవద్ద చనిపోతున్న వారి మరణాలపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా తెదేపావారు శవ రాజకీయాలు చేస్తున్నారు. అప్పారావు అనే వ్యక్తి అంత్యక్రియలు పూర్తయ్యాక ఆయన కుటుంబీకులకు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందంటూ ఆశ పెట్టి ఫిర్యాదు చేయించారు. సమస్యకు కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం చేయిస్తాం’ అని తెలిపారు.
ఒక్కో కుటుంబానికి తెదేపా సాయం రూ.10వేలు