పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, పెదపాడు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో.. 44 లంక గ్రామాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లానే కరోనా రెండో దశలో.. లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైరస్ వ్యాప్తి ఊహించని రీతిలో పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా నమోదైంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి అన్ని చోట్లా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ చర్యలతో పాటు దైవబలం కూడా కావాలని నమ్మిన గ్రామస్థులు.. గ్రామదేవతలకు పూజలు నిర్వహించారు. కరోనా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూనే ఊళ్లలోని గ్రామదేవతలకు.. ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ముడుపులు చెల్లించారు. కరోనా నుంచి తమ ఊళ్లను రక్షించాలని.. ప్రజలను కాపాడాలని ప్రార్థించారు. అన్ని లంక గ్రామాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించారు.
కరోనా రెండో దశలో.. లంక గ్రామాల్లో పెరిగిన వైరస్ వ్యాప్తి - కరోనా కట్టడికి పూజలు
పల్లెల్లో రోజురోజుకూ కరోనా ఉద్ధృతి అధికమవుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు కావటంతో పాటు, మరణాల శాతమూ ఎక్కువగా ఉంటోంది. ఎలాగైనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక గ్రామాలు స్వచ్ఛంద నియంత్రణను పాటిస్తున్నాయి. ఇలాంటి చర్యలను కొనసాగిస్తూనే, పశ్చిమగోదావరి జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు..తమ ఊళ్లను కాపాడాలంటూ గ్రామదేవతలకు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
లంక గ్రామాల్లో పెరిగిన వైరస్ వ్యాప్తి
కొవిడ్ ఆంక్షలతో పాటు గ్రామదేవతల పూజలతో.. వైరస్ ఉద్ధృతి తగ్గుతోందని గ్రామస్థులు అంటున్నారు. కరోనా వ్యాప్తి నెమ్మదించడంతో పాటు మరణాల శాతం కూడా దిగొచ్చిందని.. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా... తమ నిర్ణయాలను గౌరవించి మహమ్మారి నియంత్రణకు సహకరిస్తున్నారని చెబుతున్నారు. మరికొన్నాళ్లు ఆంక్షలను అమలుచేస్తే... సాధారణ పరిస్థితి నెలకొంటుందని.. గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ వేళ.. భగ్గుమంటున్న ధరలు