తణుకులో..
తణుకులో ఏ నిమిషంలో అనుమతులు వచ్చినా.. మరుక్షణం కోడి పందేలను ప్రారంభించడానికి నిర్వాహకులు, పందేలు కాయడానికి పందెం రాయుళ్లు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోడి పందాలు పేకాటలు జరగనిచ్చేది లేదంటూ పోలీసులు భీష్మించుకు కూర్చున్నారు. తమ చర్యల్లో భాగంగా కోడిపందేలు ఎక్కువగా జరిగే బరులన్నింటి వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు జిల్లా నుంచి వచ్చిన అదనపు బలగాలను ఇందుకోసం వినియోగిస్తున్నారు. మరోవైపు పందెం రాయుళ్లు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అనుమతి వచ్చిన క్షణాల్లోనే కోళ్లను దించడానికి సిద్ధం చేశారు. కత్తులు సాన బట్టి సిద్ధం చేశారు.
భీమవరం పరిసర ప్రాంతాల్లో..
పోలీసుల ఆంక్షల నడుమ కోడి పందేలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆలస్యంగా బరులు సిద్ధం చేశారు. కుక్కునూరు, ఉండి, సీసలి, భీమవరం, తనుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు మొదలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. నిన్నటి వరకు కోడిపందేలు అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు సాగించారు. రాజకీయ నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరగడంతో కోడిపందేలకు అనధికారికంగా అనుమతి ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. నిన్న కోడిపందెం నిర్వాహకులను పోలీసులు బైండోవర్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని స్టేషన్లో ఉంచారు. ఈ ఉదయం వారిని వదిలేయడంతో కోడి పందేల బరులు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ 30 అమలు చేస్తున్నారు. ఇవేవీ సంక్రాంతి కోడి పందేలను ఆపలేకపోయాయి.
ఉండి నియోజకవర్గంలో..
ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం సీసలిలో సంప్రదాయ పద్ధతిలో కోడిపందేలను తెదేపా ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రారంభించారు . కోడి పందేలకు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు.