CM promise about polavaram victims:సెప్టెంబరు నాటికి 41.15 కాంటూరు పరిధిలోని విలీన మండలాల బాధితులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి, పునరావాస కేంద్రాలకు తరలిస్తాం. కేంద్రం ఇవ్వకున్నా రాష్ట్ర నిధులతోనైనా పునరావాసం చేపడతాం. ఈ మాట చెప్పింది.. మంత్రో, కలెక్టరో కాదు సీఎం జగన్. జూలై 27న ముంపు మండలాల్లో పర్యటిస్తూ ఇచ్చిన హామీ. మడమ తిప్పం అని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి మాటిచ్చికా.. నెరవేరకుండా ఉంటుందా అని నిర్వాసితులు సంబరపడ్డారు. తీరా అక్టోబర్ పోయి నవంబర్ వచ్చినా... పరిహారం ఊసే లేదని బాధితులు బావురుమంటున్నారు.
'పునరావాస కాలనీలు పూర్తి కాకపోవడంతో.. గుడారాల్లో కాలం వెళ్లదీస్తున్నాం. పరిహారం అందిస్తే పునరావాస కేంద్రాలకు తరలిపోతాము.- రాజమ్మ, రేపాకగొమ్ము
గోదారి వరద ముంపుతో సర్వం కోల్పోయి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితుల్ని పరామర్శించిన సీఎం జగన్.. ఈ ఏడాది జూలై 27న వారికి ఇచ్చిన హామీ ఇది. సీఎం మాటిచ్చి మూడు నెలలు పూర్తైనా.. ఇప్పటికీ ప్యాకేజీ నిధులు అందలేదు. పునరావాస కాలనీలు సైతం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని నిర్వాసితులు వాపోతున్నారు. సీఎం మాట మీద నమ్మకంతో కూలిన ఇళ్లలోనే బిక్కుబిక్కు మంటూ ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.