Jangareddygudem deaths: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నాటుసారా తాగి 15 మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనపైనా చర్యలు చేపట్టాలని కోరారు. కుళ్లిన కోడిగుడ్లు పెట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం, ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్కారీ ఉదాసీనత కారణంగా ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సారా మరణాలన్నీ సర్కారు హత్యలే : లోకేష్
జంగారెడ్డిగూడెంలోని సారా మరణాలన్నీ వైకాపా ప్రభుత్వం చేసిన హత్యలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రెండు రోజుల్లో 15 మంది మృత్యువాత పడితే కనీసం ప్రభుత్వంలో సంబంధిత మంత్రికానీ.. అధికారి కానీ.. స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రికి జగన్ భజనతోనే పదవీకాలమంతా పూర్తయ్యిందని.. కనీసం ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించకపోవడం విచారకరమని ధ్వజమెత్తారు. ఈ మరణాలపై న్యాయవిచారణ చేసి.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.