విజయదుర్గ హోమ్ ఫైనాన్స్ సంస్థకు చెందిన వ్యక్తులమంటూ కొందరు నెల రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరుకు వెళ్లారు. హామీ లేకుండానే 50 వేల రూపాయలు రుణాలిస్తామని నమ్మబలికారు. అందుకు ఆధార్, రేషన్ కార్డుల నకళ్లతోపాటు సభ్యత్వం కోసం 15 వందల రూపాయలు చెల్లించాలని చెప్పారు. అలా చెల్లించిన వారికి ఒక ఎలక్ట్రికల్ కుక్కర్‌ను అందించారు.
హమీలేని రుణాలంటూ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు - cheating
ఎటువంటి హామీ లేకుండా ప్రతి మహిళకు 50 వేల రూపాయలు రుణం ఇస్తామంటూ కొందరు వ్యక్తులు భారీ మోసానికి తెరలేపారు. సభ్యత్వ, బీమా రూసుములంటూ ఒక్కో మహిళ వద్ద రూ.3 వేలు వసూలు చేశారు.
రుణం మంజూరు కావాలంటే ఇన్సూరెన్స్ కోసం మరో 15 వందల రూపాయలు చెల్లించాలన్నారు. ఇలా విస్సాకోడేరులో సుమారు 200 మంది మహిళల నుంచి ఒక్కొక్కరి వద్ద 3 వేల రూపాయల చొప్పున వసూలు చేసి పత్తా లేకుండా పోయారు. వారిచ్చిన ఫోన్ నెంబర్లు కూడా పని చేయకపోవడంతో బాధిత మహిళలు లబోదిబోమన్నారు. వారిచ్చిన చిరునామా సైతం తప్పని తేలింది. విస్సాకోడేరుతోపాటు భీమవరం, పాలకోడేరు, వీరవాసరం తదితర ప్రాంతాల్లో కూడా ఈ ముఠా ఇదే తరహా మోసానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. పేదల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.