Bank Robbery in West Godavari District: పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో పట్టపగలే బ్యాంకులో దోపిడీ జరిగింది. సిబ్బందిని కత్తితో బెదిరించిన దుండగుడు.. రూ.6.5 లక్షలతో ఉడాయించాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బ్యాంక్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురంలోని రెడ్డప్పవారివీధిలోని స్టేట్ బ్యాంకు బజారు శాఖ సమీపంలో పెద్దగా జనసంచారం ఉండదు. దీనికితోడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పట్టణంలో వర్షం కురిసింది. బ్యాంకు మేనేజరు పి.ప్రేమ్‌కుమార్ ఇంటికి భోజనానికి వెళ్లారు. ఆ సమయంలో ప్రధాన క్యాషియర్ కనకదుర్గ, క్యాషియర్ శిరీష, మెసెంజర్ పిట్టా డేజిఫ్లారెన్స్ ఉన్నారు. కనకదుర్గ తన ఛాంబర్‌లో మెసెంజర్‌తో కలిసి నగదు లెక్కిస్తున్నారు.
ఆ సమయంలో ముఖం కనిపించకుండా చేతి రుమాలు, తలపై టోపీ ధరించిన వ్యక్తి చేతిలో బ్యాగుతో మెయిన్ క్యాషియర్ ఛాంబర్‌లోకి ప్రవేశించాడు. తనకు బంగారు ఆభరణాలపై రుణం కావాలని కోరగా.. నాణ్యతా నిర్ధారణ అధికారి వచ్చే వరకు బయట వేచి ఉండాలని క్యాషియర్ సూచించారు. ముఖానికి ఉన్న రుమాలు తొలగించాలని డేజిఫ్లారెన్స్ సూచించగా తనకు అనారోగ్యంగా ఉందని ఆ వ్యక్తి బదులిచ్చాడు.
పట్టపగలే దోపిడీ.. గన్‌తో బెదిరించి బ్యాంకు లూఠీ!
తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ నుంచి బయటకు తీసిన కత్తిని చూపి చంపేస్తానని బెదిరించాడు. టేబుల్‌పై ఉన్న రూ.7.50 లక్షలు విలువగల నోట్ల కట్టలనుఅపహరించుకుని వెళ్తుండగా.. వాటిలోని రూ.500 నోట్ల కట్టలు రెండు బ్యాంకులోనే జారిపడ్డాయి. మిగిలిన రూ.6.50 లక్షల నగదుతో ఆ ఆగంతుకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. బ్యాంకు ఆవరణలో బందోబస్తు లేదు. బయట సీసీ కెమెరాలు కూడా లేవు. దీంతో ఆగంతుకుడు ఏ వాహనంపై ఎటువైపు వెళ్లాడో తెలియని పరిస్థితి నెలకొంది.