పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ముగ్గురు స్నేహితులు మధ్య మద్యం మత్తులో వివాదం చోటు చేసుకుంది. కోడిపుంజును అమ్మిన డబ్బుల విషయంలో స్నేహితుడి హత్యకు దారి తీసింది.
వివరాల్లోకి వెళితే...
తాడేపల్లిగూడెం చెందిన టేకు మోషే, పప్పొప్పుల దొరబాబు, మరపట్ల రాజకుమార్ ముగ్గురు కలిసి రోజూ మద్యం సేవించడం అలవాటుగా మారింది. పందెం కోళ్లు పెంచే అలవాటున్న దొరబాబు ఓ మేజర్‌కి కోడిపుంజు అమ్మడంతో వచ్చిన డబ్బు వివాదంలో టేకు మోషేకి దొరబాబుకు వివాదం కాస్తా గొడవగా మారింది.
ఎలా జరిగిందంటే..
ఈ నెల 5వ తేదీన మోషే మద్యం మత్తులో దొరబాబు ఇంటికెళ్లి ఘర్షణకు దిగి..దుర్భాషలాడాడు. సహనం కోల్పోయిన నేర చరిత్ర కలిగి ఉన్న దొరబాబు, రాజ్ కుమారులు ఇద్దరూ కలిసి మద్యం మత్తులో మోషే మీద బలమైన దుడ్డు కర్రతో దాడి చేశారు. తరువాత మోషేను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ఏలూరు కాలువ వద్దకు తీసుకెళ్లి కాలువలో పడవేసి హతమార్చారు. మోషే భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణలో ఈ ఉదంతం వెలుగు చూసింది.
పోలీసులకు పట్టుబడ్డ దొరబాబు, రాజ్ కుమార్ల నుంచి పోలీసులు హత్య జరిగిన తీరును, పూర్తి వివరాలు రాబట్టారు. మోషే మృతదేహాన్ని కాలువలో పడేసిన పిమ్మట అక్కడే బట్టలు విప్పి, స్నానం చేసి వీరిరువురు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలకు పరారయ్యారు. వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోయాక తాడేపల్లిగూడెం రావడంతో పోలీసులకు చిక్కారు. ఈ కేసులో టేకు మోషే మృతదేహం లభ్యం కావలసి ఉంది.
తొలుత మోషే భార్య మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 307 కింద కేసు రిజిస్టర్ చేసి... తరువాత సెక్షన్ 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులోని నిందితులకు కచ్చితంగా కఠిన శిక్ష పడుతోందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులను డిఎస్పీ రాజేశ్వర్రెడ్డి అభినందించారు.
ఇదీ చదవండి:చింతకొమ్మదిన్నె ఘటనలో.. మిగిలిన చిన్నారి మృతి