దేశమంతా లాక్ డౌన్ పాటిస్తున్న వేళ కొంతమంది అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటివేస్తున్నారు. వాహనాల్లో దాక్కొని మరి సరిహద్దులు దాటిస్తున్నారు. ఇదిలానే కొనసాగితే కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి ఆంధ్ర- తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర భైంసా సరిహద్దు నుంచి ఉల్లిపాయలు లోడు లారీలో కాకినాడ వెళ్తున్న 8 మందిని సరిహద్దు వద్ద అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మందలపల్లి నుంచి కెమికల్స్ లారీలో వస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలవరం సీఐ మూర్తి వారి వివరాలు తెలుసుకున్నారు. రెండు లారీలను సీజ్ చేసి వారందరిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.