Village Volunteers Participated in Sarpanch Election Campaigns : విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం పంచాయతీ సర్పంచి పదవికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఆ గ్రామ వాలంటీర్లు ఇద్దరు లగుడు భారతి, పూడి భవాని, వీఆర్ఏ ఆర్. ఈశ్వరరావు, విజయనగరం కలెక్టరేట్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగి నాగరాజు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ నాయకుడు కరక మహేశ్వరరావుతో కలిసి వారు బ్యాలెట్ నమూనా పత్రాలు పట్టుకుని మంగళవారం ఇంటింటికీ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేయడం గ్రామంలో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. వైఎస్సార్సీపీ మద్దతుతో పంచాయతీ సర్పంచిగా గత ఎన్నికల్లో గెలుపొందిన కరక సూరీడమ్మ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఈ పదవి ఖాళీ అయింది. ఇదే పంచాయతీలో రెండో వార్డు సభ్యురాలిగా ఎన్నికైన పి. శాంతికుమారికి అంగన్వాడీ కేంద్రంలో చిరుద్యోగం రావడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఈ రెండు పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఎలక్షన్ డ్యూటీకి.. వాలంటీర్లను దూరంగా ఉంచాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
నామినేషన్ల ఉప సంహరణ అనంతరం ఒక్కో పదవికి బరిలో ఇద్దరే మిగలడంతో ముఖాముఖి పోటీ నెలకొంది. ఈ రెండు పదవులకు మహిళలే పోటీ పడుతున్నారు. సర్పంచి పదవికి వైఎస్సార్సీపీ మద్దతుతో కరక గౌతమి, టీడీపీ మద్దతుతో కరక రామయ్యమ్మ బరిలో నిలిచారు. ఈ నెల 19న ఎన్నిక జరగనుండటంతో ఇరు వైపులా పంచాయతీలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
మరీ ఇంత బరితెగింపా? :అధికార వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న కరక గౌతమికి మద్దతుగా గ్రామ వాలంటీర్లు, వీఆర్ఎ, కలెక్టరేట్లో పని చేసే పొరుగు సేవల ఉద్యోగి బహిరంగంగా ప్రచారం చేశాపరు. ఉన్నతాధికారులు హెచ్చరికలు బేఖాతరు చేసిన, న్యాయస్థానం ఆదేశాలు ధిక్కరిస్తూ అధికార పార్టీ మద్దతుదారుగా పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త డాక్టర్ కె.ఎ.నాయుడు డిమాండ్ చేశారు.