ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి ట్యాంకులు, జాతీయ నాయకుల విగ్రహాలు.. రాజకీయ పార్టీల జెండాను పోలిన రంగుని పులుముకున్నాయి. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో పాటు.. న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవటంతో ఆ తంతుకు అడ్డుకట్ట పడింది. తాజాగా... ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన గృహాలకు రంగు మారుతోంది.
విజయనగరం జిల్లా సారిపల్లిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లుకు రంగు మార్చటం ఇందుకు ఉదాహరణ. ఈ గృహ సముదాయానికి గతంలోనే రంగులు వేశారు. తాజాగా మరోసారి రంగులు వేస్తున్నారు. ప్రస్తుతం వేస్తున్న రంగు ఓ పార్టీ జెండా రంగుని పోలి ఉండడం విమర్శలకు తావిస్తోంది. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని లబ్దిదారులకు సారిపల్లిలో.. 2,656 ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇక మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే మిగిలింది. ఈ తరుణంలో రంగు మారటం విశేషం. టిడ్కో డీఈ బాలకృష్ణ వివరణ ఇస్తూ తమ శాఖ ఆదేశాల మేరకు నీలం, క్రీం రంగులు వేస్తున్నామని చెప్పారు.