ఉరుములు, మెరుపులు, పిడుగుల ప్రభావం వేసవి కాలంలోనే ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకు పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతుంటాయి. దీని వల్ల భూతాపం పెరుగుతుంది. ఈ సమయంలో సముద్రం నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే ఆకాశంలో నల్లని దట్టమైన క్యూములోనింబస్ మేఘాలు అలుముకుంటాయి. ఈ సందర్భంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఏటా విజయనగరం జిల్లాలో వీటి ధాటికి ఎంతో మంది బలవుతున్నారు.
ముందే మేల్కొంటే..
- పిడుగుల సమాచారాన్ని వజ్రపాత్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఉండే వలయాలను అనుసరించి ఏ ప్రాంతంలో పిడుగు పడుతుంది.. మనం ఎంతవరకు రక్షణ పొందవచ్చో తెలియజేస్తుంది.
- విపత్తుల శాఖ సైతం వర్షం, పిడుగులు పడే సూచనలను ముందుగానే ప్రజల చరవాణులకు సంక్షిప్త సందేశాల రూపంలో పంపుతుంది. దీంతో పాటు, ముందుగానే అన్ని మండలాల తహసీల్దార్లను అప్రమత్తం చేస్తుంది.
- పిడుగుపాటుకు గురయ్యే సమయం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా విపత్తుల శాఖ అధికారులు కరపత్రాలు, గోడపత్రికల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
పరిహారం అందుతుంది.. తెలుసా!
ప్రకృత్తి విపత్తు నష్టం కింద ప్రభుత్వం మృతి చెందిన వారి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తుంది. కన్ను, కాలు వంటివి కోల్పోతే (తీవ్రత 40-60 శాతం లోపు అయితే) రూ.59,100, తీవ్రత 60 శాతం దాటితే రూ.2 లక్షలు ఇస్తుంది. ఇందుకు వైద్యులు ధ్రువీకరించాలి. ఎఫ్‌ఐఆర్ నమోదు కావాలి. పంచనామా, పోస్టుమార్టం ఆధారంగా తహసీల్దారు నివేదిక అందించాలి. జిల్లాలో బాధిత కుటుంబాలకు ఈ పరిహారం సకాలంలో అందడం లేదు. జిల్లాలో 2018 వరకూ చెల్లించారు. ఆ తర్వాత జిల్లా అధికారులు నివేదికలను పంపినప్పటికీ నిధులు విడుదల కావడం లేదు.