Damaged Roads: విజయనగరం జిల్లాలో ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు సహకారంతో.. రాష్ట్ర గ్రామీణ రహదారుల పథకంలో భాగంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గజపతినగరం, శృంగవరపుకోట, నెల్లిమర్ల నియోజకవర్గాల్లోని 56 రహదారులు, రెండు వంతెనల నిర్మాణానికి.. రెండేళ్ల క్రితం సుమారు వంద కోట్ల నిధులు కేటాయించారు. నిధుల మంజూరులో జాప్యం కారణంగా చాలాచోట్ల పనులు ప్రారంభించకపోగా.. చేపట్టిన వాటిని మధ్యలోనే వదిలేశారు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తి చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పడి రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని ప్రయాణీకులు ఆవేదన చెందుతున్నారు.
రహదారి పనులు అసంపూర్తిగా నిలిచిపోవటంతో.. వాహనాలు నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోతుల రోడ్లలో వాహనాలు పాడవుతున్నాయని చెబుతున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పటం లేదని విద్యార్థులు అంటున్నారు.