Paddy Farmers Problems: విజయనగరం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 2లక్షల 30 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 5 లక్షల 11 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో 2 లక్షల 64 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఇది పూర్తికాగానే క్షేత్రస్థాయిలో మరో లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం ఉండిపోయినట్లు వ్యవసాయ అధికారులు తేల్చారు. వీటిలో 80 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అనుమతి తీసుకొని ఇప్పటి వరకు 65 వేల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఈ లెక్కన మరో 15 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయనున్నారు. మిగిలిన ధాన్యం ఎవరు తీసుకుంటారో చెప్పలేకపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో లక్షా 91 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇంకా 57 వేల మెట్రిక్ టన్నులు రైతుల వద్ద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండో విడతగా 20 వేల మెట్రిక్ టన్నులకు అనుమతి ఇవ్వగా ఇదీ పూర్తి చేశామని చెబుతున్నారు. అయితే మరో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉందని అంచనా.
ఒకేరోజు మూడుచోట్ల:మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. గురువారం వీరఘట్టం మండలం చలివేంద్రిలో రైతులు ఏకంగా కలెక్టర్‌నే అడ్డుకున్నారు. ఇదే మండల పరిధిలోని సంతనరిశిపురంలోనూ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. గరుగుబిల్లి మండలం శివ్వాం, సీమలవానివలసలో ఆర్బీకె సిబ్బందిని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇలా ఒకేరోజు మూడుచోట్ల అన్నదాతలు నిరసనలకు దిగారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.