విజయనగరం జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా మార్కెట్ కమిటీల్లో శాశ్వత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు గతంలో ప్రకటించారు. ఇంతవరకు ఆచరణలో పెట్టలేదు.మరోవైపు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సాలూరు, ఎస్.కోట, చీపురుపల్లి, పూసపాటిరేగ, గజపతినగరం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ ఇంతవరకు తెరవలేదు. వ్యవసాయశాఖ అధికారులు 35 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు నివేదించారు. దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రతి మండలంలో ఒక కేంద్రం ఉండేలా ప్రతిపాదించారు. జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేసినా కొన్ని మండలాల రైతులు కేంద్రాలకు పంటను తీసుకురావడం కష్టమే. రవాణా మొత్తాలు భారంగా మారే అవకాశం ఉంది. పార్వతీపురం డివిజన్‌లోని ఒక్క సాలూరులో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే సుమారు 10 మండలాల రైతులు అక్కడకు తీసుకువెళ్లి విక్రయించడం కష్టమే. మిగిలిన వాటికి కేంద్రాలు దూరమే. దీంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. వ్యవసాయశాఖ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే రైతులు విక్రయించుకునేందుకు వెసులుబాటుగా ఉంటుంది.
వెనకడుగు వేయడానికి కారణాలు ఇవే!
గతంలో రైతుల చెంతకు వెళ్లి ప్రైవేటు వర్తకులు కొనుగోలు చేసేవారు. గతేడాది క్వింటా రూ.1710లు మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు వర్తకులు రైతుల చెంతకు వెళ్లి రూ.1950ల చొప్పున అప్పట్లో కొనుగోలు చేశారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఒక క్వింటా కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. బయట ధర ఎక్కువగా ఉండటమే కారణం. ఈ ఏడాది రూ.1765ల మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు ట్రేడర్లు రూ.1300లకు మించి అడగడం లేదు. అయినా వారు రైతుల వైపు చూడడం లేదు. దీనికి కారణాలు లేకపోలేదు. మొక్కజొన్న ఆధారిత ఉత్పత్తులకు అంతగా డిమాండు లేకపోవడం. కరోనా నేపథ్యంలో కోళ్ల పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లడం, రవాణా నిలిచిపోవడం వంటి వాటితో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక వేళ రైతుల నుంచి కొనుగోలు చేసినా అక్కడే నిల్వ చేసుకోవాలే తప్ప లారీల్లో నచ్చిన ప్రాంతానికి ఎగుమతి చేసేందుకు ఆస్కారం లేదు. ఇలాంటి ఇబ్బందులతో కొనుగోళ్లు నిలిచిపోయాయి.
కేంద్రాల ఏర్పాటుకు చర్యలు