ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లె పోరు:పెద్ద ఊరు.. రసవత్తర పోరు

పల్లెపోరు వేడెక్కుతోంది. ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ముఖ్యంగా మేజర్ పంచాయతీల్లో పలువురు నేతలకు అగ్ని పరీక్షగా మారాయి. ఇంకో పార్టీకి అవకాశం లేకుండా ఏకగ్రీవమో, ఎన్నికల్లో నిలిచినా సరే గెలుపు తమదే కావాలని భావిస్తున్నారు.

ap panchayat elections
ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021

By

Published : Feb 7, 2021, 10:17 AM IST

విజయనగరంలోని మేజర్‌ పంచాయతీల్లో పోరు నువ్వా-నేనా అన్నట్లు ఉంది. పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు నేతలు ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. బరిలో ఒకరి కన్నా ఎక్కువ మంది ఉన్న చోట్ల బుజ్జగిస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్లు తారుమారు కావడంతో సర్పంచి పదవిపై ఆశలు పెట్టుకున్న వారు తమ వారిని అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 15 పెద్ద పంచాయతీలుండగా.. అన్ని చోట్లా పోరు హోరెత్తిపోతోంది.

  1. పార్వతీపురంనియోజకవర్గంలోని పెదభోగిలిలో పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ తెదేపా తరఫున జొన్నాడ పేరేజమ్మ, రెబల్‌గా దేవరపల్లి రోజమ్మ బరిలో ఉన్నారు. వైకాపా మద్దతుదారుగా మాజీ ఎమ్మెల్యే జయమణి కుమార్తెలు సవరపు ఆశిని రోజా, ప్రత్యూష ఇద్దరు నామపత్రాలు దాఖలు చేశారు. వీరిలో ఎవరో ఒకరు ఉపసంహరించుకుంటే అభ్యర్థి కొలిక్కి వస్తారు.
  2. కొత్తవలసలోరెండు పార్టీల వారు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినా అధికారికంగా ప్రకటించలేదు. ఆశావ హులు ప్రచారం పోటాపోటీగా చేస్తున్నారు.
  3. మక్కువలోతెదేపా తరఫున మర్రి జయమ్మ నామపత్రం దాఖలు చేశారు. వైకాపా మద్దతుతో ఒంటి రామలక్ష్మి బరిలో నిలిచారు.
  4. జామిలోరెండు ప్రధాన పార్టీల నుంచి మహిళలే బరిలో నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తెదేపా నుంచి ముగురిలో ఒకరి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. వైకాపా నుంచి ఒకరి పేరునే పరిశీలిస్తున్నారు.
  5. కురుపాంమేజరు పంచాయతీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి నియోజకవర్గ కేంద్రం. ఇక్కడ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వైకాపా మద్దతుదారుగా జి.సుజాత బరిలో ఉన్నారు. తెదేపా తరఫున టి.గౌరి, భాజపా నుంచి ఈ.లక్ష్మి నిలిచారు.
  6. ధర్మవరంలోరెండు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయలేదు. పోటీలో నిలిచేది ఎవరనేది ఉత్కంఠ నెలకొంది.
  7. ఎల్‌.కోటపోరులో తలపడేది ఎవరో ఇంకా తేలాల్సి ఉంది. తెదేపాలో ఓ అభ్యర్థి పేరుపై నిర్ణయానికి వచ్చినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధికార పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  8. చీపురుపల్లిపంచాయతీపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచే మంత్రి బొత్స సత్యనారాయణ, తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికలో ఈ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించగా.. ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. తెదేపా మద్దతుదారుగా సబ్బి సోనియాను, వైకాపా నుంచి మంగళగిరి సుధారాణి పేరును ఖరారు చేశారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిని సాకేటి సరిత గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
  9. శృంగవరపుకోటలోపోరు ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించగా ఇప్పుడు ఎస్టీ మహిళకు అవకాశమిచ్చారు. ఇక్కడ వైకాపా, తెదేపా అభ్యర్థులెవరిని ప్రకటించలేదు. అధికార పార్టీలో ఓ నాయకుడు ఒక అభ్యర్థిని ప్రతిపాదించగా.. రెండో వర్గం మరో వ్యక్తిని ముందుకు తీసుకొస్తోంది. ఎమ్మెల్యే వారిని బుజ్జిగించే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ తెదేపా మద్దతుదారులే విజయం సాధించారు. ఈసారీ నెగ్గించాలని నేతలు చూస్తున్నారు.
  10. తెర్లాంపంచాయతీని గత ఎన్నికల్లాగే ఎస్సీ మహిళకే కేటాయించారు. ఇక్కడ వైకాపా మద్దతుదారుగా ఎం.మరియమ్మ, తెదేపా తరఫున బి.రూప, కాంగ్రెస్‌ నుంచి పి.సుధారాణి, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థిగా చింతాడ రాము బరిలో నిలిచారు. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు చీల్చే ఓట్లపైనే మిగతా వారి విజయం ఉంది.
  11. గజపతినగరంపంచాయతీలో పోటీ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నారు. ఇక్కడి స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. వైకాపా తరఫున నరవ కొండమ్మ బరిలో నిలిచారు. ఈ స్థానాన్ని ఆశించిన వారు ఎక్కువ ఉండగా.. ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య వారిని బుజ్జిగించి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం సాధించారు. తెదేపా మద్దతుదారుగా నరవ వరలక్ష్మి పేరును ప్రకటించారు. ఈ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్‌ ఉండటంతో పోటీ గట్టిగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.
  12. గరివిడిలోతెదేపా మద్దతుదారు పేరు ఖరారు చేయాల్సి ఉంది. వైకాపాలో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అసంతృప్తులను బుజ్జగించి ఏకాభిప్రాయంతో బరిలో దింపాలని చూస్తున్నారు. ఇక్కడ గట్టి పోటీ నెలకొంది.
  13. గర్భాంలో తెదేపా నుంచి జి.వెలంగిణి బరిలో నిలవగా వైకాపా నుంచి ఇద్దరు పోటీ పడుతుండటంతో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. రెబల్‌ అభ్యర్థిగా మరొకరు నిలిచారు. గతంలో ఈ స్థానం బీసీ మహిళకు కేటాయించగా.. ఈసారి ఎస్సీ జనరల్‌కు ఇచ్చారు.
  14. రామభద్రపురంలోపోరు హోరాహోరీగా సాగనుంది. ఈ ఎన్నికల్లో ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. తెదేపా తరఫున రవ్వ ఈశ్వరరావు, వైకాపా మద్దతుదారుగా బెల్లాన లక్ష్మణరావు నామపత్రాలు దాఖలు చేశారు. వీరిద్దరి మధ్యే తీవ్ర పోటీ ఉండనుంది.
  15. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించే భోగాపురంలోపోరు పోటాపోటీగా మారింది. తెదేపా తరఫున అప్పాయమ్మ పేరును ఖరారు చేశారు. వైకాపా మద్దతు అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. అధికార పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఎవరి పేరు ప్రకటించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details