విజయనగరం జిల్లాలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రాజెక్టులపై పూర్థిస్థాయిలో సమీక్ష నిర్వహించారని చెప్పారు.
జిల్లాలో పలు ప్రాజెక్టుల పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వాటి డిజైన్ ప్రకారం, పూర్తిస్థాయిలో నిర్మించినప్పుడు మాత్రమే సంపూర్ణంగా ప్రయోజనం ఉంటుదని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణాలను సమీక్షించి, సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ప్రతీ రెండు వారాలకోసారి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశాలను నిర్వహించి, వాటిని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
జాయింట్ కలెక్టర్ డాక్టర్ జీసీ.కిశోర్ కుమార్ ప్రాజెక్టులవారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, ఇంజనీరింగ్ పనులు, పునరావాస ప్యాకేజీ అమలు తదితర పలు అంశాలపై చర్చించారు. రెవెన్యూతోపాటు, గృహ నిర్మాణశాఖ, గిరిజన సంక్షేమశాఖ, గ్రామీణ నీటి సరఫరా తదితర ప్రభుత్వ శాఖల పరంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఆరా తీశారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి, గుర్లమండలం నాగళ్లవలస గ్రామంలో సర్వే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సర్వేశాఖ ఎడిని, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తోటపల్లి నిర్వాసిత గ్రామాల సమస్యలు, పునరావాస ప్యాకేజీ అమలు, ఇంకా సేకరించాల్సిన భూమి తదితర అంశాలపై చర్చించారు.