రాజకీయ కుట్రలో భాగంగా కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను ఇబ్బంది పెట్టాలని చూడటం సరికాదని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మంగళవారం ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీనిలో వివరాలు ఇలా ఉన్నాయి.. తన సోదరి వెంకటరామతులసి 2008 ప్రత్యేక డీఎస్సీలో కేఆర్‌పురం ఐటీడీఏలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారని, అయితే జీవో 3 ప్రకారం ఆ ఉద్యోగానికి స్థానికులే అర్హులు కావడంతో ఆమెను అనర్హురాలుగా ప్రకటించారని మంత్రి తెలిపారు. తాము ఎస్టీ కాదు కాబట్టే సోదరికి ఆ ఉద్యోగం రాలేదని ప్రస్తుతం కొందరు ఆరోపిస్తున్నారని, ఈ విషయాన్ని ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు విసిరారు. ఎస్టీ కాకపోతే 2014లో కుటుంబం మొత్తానికి డిజిటల్ ధ్రువపత్రాలు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు.
నేను ఎస్టీ కాదని రుజువు చేయగలరా?: ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి - AP news
కుల వివాద ఆరోపణలపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి క్లారిటీ ఇచ్చారు. తన స్వస్థలం టి.డి పారాపురం వెళ్లీ ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చని చెప్పారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే నిజనిజాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.
బుట్టాయగూడెం మండలంలో తన సోదరికి ఎస్టీ ధ్రువపత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు. తనకు రాజకీయాలు తెలియని రోజుల్లో, రాజకీయాల్లోకి రాకముందే ఈ పత్రాలు అందజేశారన్నారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయంలో కుల ధ్రువపత్రాలు చెల్లవని, నామినేషన్ తిరస్కరించాలని కొందరు ఫిర్యాదు చేశారన్నారు. అప్పటి తహసీల్దారు ఇచ్చిన ధ్రువపత్రాన్ని ఆర్వోకు చూపించడంతో అనుమతి లభించినట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం టీడీ పారాపురం వెళ్లి తమ కుటుంబం గురించి దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. కావాలనే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరు చేయిస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి వీడియో సందేశంలో తెలిపారు.
ఇదీ చదవండీ... 'మీ మద్దతు ఆశిస్తున్నాం.. అమరావతికి రండి'