ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 దశాబ్దాల సమస్య తీర్చిన 'పసుపు - కుంకుమ'! - undefined

''నాకు కోటి మంది అక్కా చెల్లెళ్లు. వారి సంక్షేమమే నా ధ్యేయం'' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పసుపు కుంకుమ లాంటి పథకాల అమలుతో ఆ మాటకు తగినట్టే వ్యవహరించారు. ఇప్పుడు అదే పథకం.. ఓ ఊరిలో జనానికి దాహాన్ని తీరుస్తోంది. 2 దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించింది.

పసుపు కుంకుమ పథకం

By

Published : Apr 18, 2019, 6:03 AM IST

పసుపు కుంకుమ పథకం

పసుపు - కుంకుమ. రాష్ట్ర మహిళలను తెదేపా ప్రభుత్వానికి దగ్గర చేసిన పథకం. మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించిన పథకం. మరే రాష్ట్రంలోను లేని విధంగా.. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఈ కార్యక్రమం... అనూహ్య ఫలితాలు అందిస్తోంది. మహిళకు ఆర్థిక ఆసరా కల్పిస్తే.. ఎంతటి అత్యున్నత ఫలితం సాధించవచ్చన్నదీ తెలియజేస్తోంది. విజయనగరం జిల్లా చాపరాయి వలస గ్రామం... 2 దశాబ్దాలుగా వేధిస్తున్న ఓ సమస్యను పసుపు కుంకుమ నిధులతో పరిష్కరించుకున్న తీరు... రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు ఆదర్శంగా నిలుస్తోంది.
చాపరాయి వలస... విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని గిరిజన గూడెం. 15 కుటుంబాలున్న ఈ గూడెంలో 2 దశాబ్దాలుగా తాగునీటి సమస్య ఉంది. 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన తాగునీటి పథకం కొన్నాళ్లకు నిరూపయోగంగా మారింది. నెలకు ఒక్కసారి నీళ్లు సరఫరా కాని పరిస్థితి. తాగునీటి కోసం ఆ ఊరి ప్రజలు రెండున్నర కిలోమీటర్ల నడవాల్సిన పరిస్థితి. వేసవిలో అయితే.. వారి బాధ మరింత దయనీయం. ఈ సమస్యపై గ్రామస్తులు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. చివరికి.. పసుపు కుంకుమ పథకం.. వారి దాహం తీర్చుకునేందుకు దారి చూపింది.

డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన 'పసుపు - కుంకుమ' నిధులు.. చాపరాయి వలస గ్రామస్తులకు చీకట్లో చిరుదీపంలా దారి చూపాయి. 20 ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యను.. ఆ నిధులతో పరిష్కరించుకున్నారు. రక్షిత మంచినీటి పథకానికి లక్ష రూపాయలు అవసరమని గుర్తించారు. పసుపు - కుంకుమ ద్వారా ఒక్కో సభ్యురాలికి అందిన 10 వేల రూపాయల్లో ఒక్కొక్కరూ 6 వేలు అందించాలని తీర్మానించుకున్నారు. ఈ మొత్తానికి తోడుగా... ఇంట్లో భర్తల్ని ఒప్పించి మరో 34 వేల రూపాయల విరాళాలు సేకరించారు. ఇలా పోగు చేసిన మొత్తంతో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. పంచాయతీ తరఫున ఏర్పాటు చేసిన బోరుకు మోటారును... పైపులైన్​తో అనుసంధానించారు. గ్రామంలో 2 వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు ఏర్పాటు చేసుకున్నారు.

నీటి సమస్య తీరటంతో చాపరాయి వలస గిరిజన గూడెం కుటుంబాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. సమస్య పరిష్కారంలో మహిళలు చూపిన చొరవను గ్రామస్థులు అభినందిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా తీరని సమస్య... డ్వాక్రా సంఘం సభ్యుల ద్వారా పరిష్కారం కావటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయానికి పసుపు - కుంకుమ నిధులే కారణమని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు చేసిన సాయమే.. నీటి సమస్యను తీర్చిందని మహిళలు ఆనందంగా చెబుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details