YCP Leaders Land irregularities in Visakhapatnam: విశాఖలో వైసీపీ నేతల దందాలు అన్నీఇన్నీ కావు.. ఎక్కడైనా ప్రభుత్వ భవనాల అవసరాలకు, అభివృద్ధి పనులకు భూమి సేకరించినప్పుడు టీడీఆర్ బాండ్లు జారీ చేస్తారు. విశాఖలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా పలు కుటుంబాలు నివాసం ఉంటోన్న మురికివాడలు ప్రైవేటు వ్యక్తులవని.. వాటిని ఖాళీ చేయించలేరు కనుక ఆయా స్థలాలకు టీడీఆర్‌లు ఇవ్వాలంటూ చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే పెదజాలారిపేటలోని 20.27 ఎకరాల భూములు రాణిసాహిబా వాద్వాన్‌వి అని, వాటి మార్కెట్ ధరకు నాలుగు రెట్లు టీడీఆర్ బాండ్లు జీవీఎంసీ మంజూరు చేయాలని కోరడం.. అధికారుల సర్వే చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మరో మూడు దస్త్రాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ముందుకు కదులుతున్నాయి. ఈ బాండ్లను వెంటనే మంజూరు చేయాలంటూ తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
విశాఖ సీతమ్మధార సమీపంలో రేసపువానిపాలెం సర్వే నంబరు 7లో 3.11 ఎకరాలు, 0.76 ఎకరాలు ఆంధ్రా బ్యాంకు హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన భూమిగా దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి 3.11 ఎకరాల్లో బిలాల్ కాలనీ ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలు నాలుగు దశాబ్దాలకు పైగా ఇక్కడ నివసిస్తున్నారు. ఈ భూమి సొసైటీకి చెందుతుందని, ప్రస్తుత మార్కెట్ ధరకు నాలుగు రెట్లు లెక్కగట్టి 1,000 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తు వచ్చినట్లు సమాచారం.
Land Occupation: ఆ మంత్రుల నియోజవర్గాల్లో యథేచ్ఛగా భూ అక్రమాలు..
ఓ వైసీపీ నేత తన వ్యాపార భాగస్వామి బంధువు ద్వారా ఈ వ్యవహారం నడుపుతున్నారు. ఈ దస్త్రం జీవీఎంసీ ఈ-ఆఫీస్‌లో 199568 నంబరుతో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. 2016లో బిలాల్ కాలనీలోని భూమి సొసైటీదంటూ అప్పట్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు ఆ భూములకే టీడీఆర్‌లు ఇచ్చేందుకు జీవీఎంసీ ముందుకెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీఎంఆర్ గోదాం వెనుక వైపు పాత 20వ వార్డులోని వెంకటపతిరాజు నగర్ మురికివాడలో 0.76 ఎకరాలు ప్రైవేటు వ్యక్తికి చెందినదిగా పేర్కొంటూ మరో దరఖాస్తును తెరపైకి తెచ్చారు.
వాస్తవానికి మురికివాడల్లో టీడీఆర్‌లు ఇవ్వాల్సి వస్తే 1:1 నిష్పత్తిలో చెల్లించాలి. అందుకు విరుద్ధంగా స్థలం విలువకు నాలుగు రెట్లు అంటే దాదాపు వంద కోట్లు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలంటూ ప్రతిపాదన పెట్టారు. మురికివాడల ముసుగులో టీడీఆర్ కుంభకోణాలు జరుగుతున్నాయని జనసేన కార్పోరేటర్ మూర్తియాదవ్ ఆరోపించారు.