ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దివ్య'మైన జీవితాన్ని.. దారి తప్పించి.. దారుణంగా చంపేశారు! - ఆశ్రయం కల్పించినవారే.. అంతమెుందిచారు !

ఆశ్రయం కల్పించినవారే అంతమెుందిచారు. కంటికి రెప్పలా కాపాడుతారనుకున్నవారే కాటేశారు. పడుపు వృత్తిలోకి దింపి పాడు పనులు చేయించారు. చెప్పిన మాట వినడం లేదని.. గుండు గీయించారు. కనుబొమ్మలు గీయించి చిత్రహింసలకు గురిచేశారు. సహజ మరణంగా చిత్రీకరించి.. అంత్యక్రియలు చేసే ప్రయత్నంలో.. కాటి కాపరికి అనుమానం వచ్చింది. ఆ అనుమానమే.. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం చెక్కుడురాయి ప్రాంతంలో మృతి చెందిన దివ్య కేసులో.. నమ్మలేని నిజాలు బయట పెట్టింది.

vishaka-murder-case-mistery
vishaka-murder-case-mistery

By

Published : Jun 6, 2020, 1:30 PM IST

Updated : Jun 6, 2020, 7:32 PM IST

విశాఖ జిల్లా అక్కయ్యపాలెం పరిధిలోని చెక్కుడురాయిలో యువతి మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెకు ఆశ్రయం కల్పించినవారే అతి కిరాతకంగా హత్య చేసినట్లు నిర్థరించారు. హత్యను సహజ మరణంగా చిత్రీకరించిన ప్రయత్నాన్ని బయటపెట్టారు. అంత్యక్రియలకు ప్రయత్నిస్తుండగా.. కాటి కాపరి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అసలు గుట్టు బయటపెట్టారు.

వ్యభిచార కూపంలోకి నెట్టి..

తూర్పు గోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన దివ్య (23) అనే యువతి.. చిన్నతనంలోనే తల్లిందండ్రులను కోల్పోయింది. అప్పటినుంచి పిన్ని వాళ్లింట్లో పెరిగింది. సుమారు 8 నెలల కిందట దివ్యను ఆమె పిన్ని అక్కయ్యపాలెం చెక్కుడురాయి భవనం సమీపంలో ఉంటున్న వసంత ఇంటికి పంపించింది. తన భర్త దుబాయ్​లో ఉండటంతో... యువతిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలని వసంత భావించింది. దివ్యను బలవంతంగా పడుపు వృత్తిలోకి దించి డబ్బు సంపాదించింది.

పంపకాల విషయంలో విభేదాలు

డబ్బు విషయంలో దివ్యకు, వసంతకు విభేదాలు వచ్చాయి. వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బులో తనకు తగిన మెుత్తం ఇవ్వటం లేదని దివ్య.. వసంతను ప్రశ్నించింది. ఇది తట్టుకోలేని వసంత కక్ష పెంచుకుంది. దివ్య తన ఇంటి నుంచి వెళ్లిపోయే ఉద్దేశంతో ఉన్నట్లు గుర్తించింది. ఆమె వెళ్లిపోతే సంపాదనకు గండి పడుతుందని ఆందోళనకు గురై ద్వేషంతో పాటు పగనూ పెంచుకుంది.

గుండు గీయించి, చిత్రహింసలకు గురి చేసి...

చివరికి.. దివ్యను ఎలాగైనా అంతమెుందిచాలని వసంత భావించింది. తన సోదరి, ఆమెకు సన్నిహితుడైన వ్యక్తి, మరికొందరితో కలిసి పథకం రచించింది. దివ్యను ఓ గదిలో బంధించి గుండు గీయించింది. కనుబొమ్మలు కత్తిరించి అంద విహీనంగా తయారు చేసింది. గత 5 రోజులుగా వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేసింది. కనీసం ఆహారం అందించలేదు. నీరసంతో, నిస్సత్తువతో విలవిల్లాడిన దివ్య.. హింసను తట్టుకోలేక బుధవారం రాత్రి ప్రాణం విడిచింది.

సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం

దివ్య చనిపోయిన తర్వాత.. సహజ మరణంగా చిత్రీకరించేందుకు వసంత విశ్వ ప్రయత్నం చేసింది. ఆమె సోదరితో పాటు.. మరో వ్యక్తి మళ్లీ పథకం పన్నారు. ఫిట్స్ కారణంగా చనిపోయిందని ఇరుగుపొరుగువారిని నమ్మించారు. కరోనా కారణంగా.. ఎవరూ లేకుండా అంత్యక్రియలు చేయాల్సి వస్తోందని నమ్మబలికారు. శ్మశానవాటిక కాపరికి కూడా అదే విషయాన్ని చెప్పారు.

విషయం బయటపడిందిలా...

దివ్య శరీరంపై ఉన్న గాయాలను కాటి కాపరి గమనించాడు. వసంత, ఆమె సంబంధికులు చెబుతున్న విషయాలపై అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. గుండు గీసి, కనుబొమ్మలు తీసేసినట్టుగా గుర్తించారు. దివ్య పిన్ని, బాబాయికి సమాచారం అందించారు. వారు ఆ మృతదేహం దివ్యదే అని నిర్థరించాక.. పోస్ట్ మార్టం చేయించారు. హత్యగా నిర్థరించారు. వసంత, ఆమె సోదరి, సహకరించిన ఓ వ్యక్తి ఆచూకీని గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయాన్ని రాబట్టారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. అలాగే.. మొబైల్ కాల్స్ ఆధారంగా.. విటుల వివరాలనూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

బాల్యం నుంచీ కష్టాలే...

దివ్య.. చిన్నతనం నుంచీ కష్టాలు పడినట్టు తెలుస్తోంది. ఆమెకు 14 ఏళ్ల వయసులోనే వివాహమైంది. 2 సంవత్సరాల తర్వాత భర్త వదిలేశాడు. ఆ తర్వాత.. 2015లో ఆమె తల్లి, సోదరుడు హత్యకు గురయ్యారు. అప్పటినుంచి పిన్ని, బాబాయి సంరక్షణలో ఉంటోంది. ఆమెను విశాఖలో పరిచయస్తురాలైన వసంతకు బాబాయి అప్పగించాడు. అప్పటినుంచి అనైతిక వ్యాపారంలో మగ్గిపోయిన దివ్య.. వచ్చిన డబ్బును పిన్ని, బాబాయికి పంపించేది. చివరికి.. ఇలా ఆమె జీవితం విషాదాంతమైంది.

Last Updated : Jun 6, 2020, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details